బాల సాహిత్య పరిశోధనలో మేటి ‘గాయత్రి’

'Gayatri' is the best in children's literature research.మన తెలుగు బాల సాహిత్యంలో ఇటీవల పరిశోధనలు ఎక్కువ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక తెలుగేతర ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాల తెలుగుశాఖల్లోనూ ఈ పరిశోధన బండి చక్కగా పట్టాలెక్కి నడుస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదలుకుని తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో జిల్లాల వారీగా తెలంగాణ బాల సాహిత్యంపై చక్కని పునర్మూల్యాంకనం జరగడం విశేషం. నా సాహిత్యంపై ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాచ్యశాఖలో పరిశోధన జరుగుతోంది. ఈ కోవలోనే ఇటీవల ఉమ్మడి పాలమూరు జిల్లా బాల సాహిత్యంపై పరిశోదన చేసి దుగ్గి గాయత్రి ‘డా. గాయత్రి’ అయ్యింది. గాయత్రి కవయిత్రి, రచయిత్రి, విమర్శకురాలు, బాల సాహితీవేత్త. పిల్లల కోసం ఎన్నో మేలిమి కథలను, గేయాలను కూర్చింది. 16 జూన్‌, 1982లో పాలమూరులో పుట్టిన గాయత్రి చారకొండలో పెరిగింది. శ్రీమతి దుగ్గి శశికళ – శ్రీ కుమారస్వామి గాయత్రి తల్లిదండ్రులు.
తెలుగు సాహిత్యంలో ఎం.ఏ, పిహెచ్‌.డితో పాటు బి.ఇడి. లైబ్రరీ సైన్స్‌లో పట్టభద్రురాలైన దుగ్గి గాయత్రి వృత్తిరీత్యా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ టీచర్‌గా పనిచేస్తోంది. రచయిత్రి, పరిశోధకురాలుగా బాల వికాసం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోన్న గాయత్రి పలు ఆన్‌లైన్‌ కవి సమ్మేళనాలతో పాటు వివిధ సంస్థల సదస్సులు, కార్యశాలల్లో పొల్గొంది. తెలంగాణ సారస్వత పరిషత్‌ నిర్వహించిన బాల సాహిత్య సదస్సులో పాల్గొంది. గాంధీ ఫౌండేషన్‌ వారి కవి సమ్మేళనం మొదలు వివిధ సంస్థలు నిర్వహించిన కవిసమ్మేళనాల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంది. బాల వికాస కార్యకర్తగా ముందువరుసలో నిలిచే గాయత్రి తన బడి విద్యార్థులను సృజన దిశగా ప్రోత్సహించి వారి రచనలను వివిధ పత్రికల్లో ప్రచురణ దిశగా ప్రోత్సహించింది.
‘పాలమూరు జిల్లా బాల సాహిత్యం – పరిశీలన’ అంశంపై డా.హెచ్‌. కిషన్‌ మార్గదర్శనంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌.డి పట్టా పొందిన డా. దుగ్గి గాయత్రి విస్తృతంగా వున్న అనేకమంది పాలమూరు జిల్లా బాల సాహితీవేత్తలను తన సిద్ధాంత గ్రంథంలో పరిచయం చేసింది. తొలిరోజుల నుండి నేటిదాకా మహబూబ్‌ నగర్‌లో జరిగిన బాల సాహిత్య రచనతో పాటు బాల వికాస కార్యక్రమాలు, బాలలు చేసిన రచనలను, బాల రచయితలను పరిచయం చేయడం విశేషం. కథలు, గేయాలు, వ్యాసాలు, సమీక్షలు రాసిన గాయత్రి తన రచనలను బాలలకు తాయిలంగా అందించారు. ‘భారత పతాకము ఎగిసి/ మింటిని అంటెను చూడరా/ స్వేచ్ఛావాయువు వీచెను/ పసినవ్వులు విరబూయగా’, ‘పాలబుగ్గల పసిడి మువ్వల పసిబాలలం/ అమ్మానాన్నల అవ్వాయి తువ్వాయిలం/ ఆకసాన వెలిగే అందాల తారలం/ బాలలం మేం బాలలం’ అంటూ చక్కని గేయాలను రాసిన ఈమె ‘ఐక్యగీతిక’లో ‘ఐక్య గీతిక పాడర తమ్ముడా/ అవేశ వాహినికి కట్టలేసి/ అందరమొకటని చాటింపు వేసి’ ఐక్యగీతం పాడమని బోధిస్తుంది. పాఠశాలలో జండా పండుగ రోజున వందనం చేయడం, పిల్లలతో చేయించడం ఈమె వృత్తిలో భాగం. దానిని గేయంగా రాస్తూ… ‘ప్రభాతభేరి తీయండోరు/ త్యాగధనులను స్మరించండోరు/ త్రివర్ణ పతాకను ఎగరేయండోరు/ స్వేచ్ఛాగీతికలు పాడండోరు/ దేశకీర్తిని నలుదిశలా చాటండోరు’ అంటుంది. కృష్ణాష్టమి రోజున గాయత్రి రాసిన గేయం ‘లీలలు’. ఇందులో ఆమె చిన్నికృష్ణుని లీలలను ఎంతో చక్కగా చూపిస్తుంది. ‘అల్లరి గోపబాలుడు/ అల్ల అల్లన పరిగెత్తుతు వచ్చెనట/ పిల్లన గ్రోవినే ఊదుతూ/ అందరి ఉల్లము ఉప్పొంగగా/ చిన్ని కృష్ణుడు వచ్చెనట’ అంటూ… ఇంకా గోవర్ధనగిరి ఎత్తడం, పూతనను వధించడం, అటుకులిచ్చిన మిత్రుని ఆదుకోవడం వంటివి ఇందులో వర్ణిస్తుంది. గణపతి పండుగను కూడా గేయంగా మలిచిందీమె, ‘బుడి బుడి నడకల బుజ్జాయిల్లారా/ బంక మట్టిని తెచ్చి మనము/ బుజ్జి గణపతిని చేద్దామా!’ అంటూ పర్యావరణ పరిరక్షణ మంత్రాన్ని బాలలకు బాల్యం నుండి పరిచయం చేస్తూనే, గణపతి ఎలుక ధాన్యపు గాదెలు చేయకుండా కాపాడాలని వేడుతుంది. గజానన శిరస్సు జ్ఞాన ప్రతీకమని పిల్లలకు చెబుతుంది. ఈ తరానికి గాంధీని పరిచయం చేయడం అత్యంత ఆవశ్యమే కాక పౌరులుగా మన విధి కూడా. బాధ్యతగా తన గేయాలలో బాలలకు గాంధీని, ఆయన తత్త్వాన్ని గేయాల్లో చక్కగా పరిచయం చేసింది- ‘బోసి నవ్వుల బాపూజి చెప్పెను/ మనకెన్నో జీవన సూత్రాలు/ నిత్యము సత్యమునె పలుకమనె/ …మానవత్వమును మరవద్దనె/ దేశ ఐక్యతను కోరుకునె’. భారత జ్యోతి బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను ‘అంటరాని తనాన్ని అణువణువును/ చీల్చేటి అరుణోదయమ్ము నీవె’ అని కీర్తిస్తుంది.
బాలల కోసం గాయత్రి చేసిన రచనలు ఎక్కువ భాగం ‘మొగ్గ’ వేదాంత సూరి మానస పుత్రిక ‘మొలక’లో వచ్చాయి. అందులో కథలు, గేయాలు, వ్యాసాలూ వున్నాయి. బాలల కోసం ఈమె రాసిన వ్యాసాల్లో ‘వ్యాస పూర్ణిమ’ ఒకటి. ఈ వ్యాసంలో గాయత్రి ఎత్తుగడ, విషయ వివరణ చూస్తే నారికేళ పాకం వంటి విషయాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్టు ఎలా పిల్లలకు చెప్పొచ్చో తెలుస్తుంది. ఇదే కోవలో ‘రాఖీ పండుగ’ వ్యాసం కూడా రాసింది. ప్రత్యేక దినోత్సవాల వివరాలు, కథా కమీమీషులతో పాటు పండుగలు, పబ్బాలను మన ‘మొలక’ల కోసం పరిచయం చేసింది. కథా రచయిత్రిగా కూడా గాయత్రి చక్కని కథలు రాసింది ‘నా తల పాగ మాట్లాడుతుంది’, ‘బతుకమ్మ’ వంటివి ఉదాహరణగా చూడొచ్చు. పాలమూరు జిల్లా బాల సాహిత్యంపైన సాధికారిక పరిశోధనతో పాటు, బాల గేయాలు, కథలు, వ్యాసాలను రాసి తెలంగాణ బాల సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్న డా. దుగ్గి గాయత్రికి తహీ దిల్‌సే ముబారక్‌బాద్‌! జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548