– ఇంటర్నేషనల్ స్థాయికి ప్రోత్సాహం : డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి
– రాష్ట్ర స్థాయి గిరిజన గురుకులాల బాలికల క్రీడా పోటీలు ప్రారంభం
– నాలుగు జోన్ల నుంచి 1200 మంది విద్యార్థినులు హాజరు
నవతెలంగాణ-ఇల్లందు
రాష్ట్రంలోని గురుకులాల విద్యార్థినీ, విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ మేటని గిరిజన గురుకులాల డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని సుదిమల్ల గిరిజన గురుకుల బాలికల కళాశాలలో గురువారం డిసెంబర్ 28 నుంచి 31వ తేదీ వరకు తెలంగాణ 7వ రాష్ట్ర స్థాయి గిరిజన గురుకులాల బాలికల క్రీడా పోటీలు ప్రారంభించారు. తొలుత జెండా వందనం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ టీ.వెంకటేశ్వరరాజు అధ్యక్షతన, ప్రిన్సిపాల్ అరుణకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 1200 మంది విద్యార్థినులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన బాలుర రాష్ట్రస్థాయి క్రీడలు కాటారంలో జరుగుతున్నట్టు తెలిపారు. ఇటీవల జోనల్ స్థాయిలో క్రీడలు నిర్వహించామని, అందులో ప్రతిభ కనబరిచిన మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు 7వ రాష్ట్ర స్థాయి బాలికల క్రీడా పోటీలకు అవకాశం కల్పించామన్నారు. మెరుగైన ఫలితాలు కనబరిచిన వారికి ఇంటర్ సొసైటీ లీగ్‌లో అవకాశం కల్పిస్తామని తెలిపారు. అన్ని విధాల తర్ఫీదు ఇప్పించి గురుకులాలను రాష్ట్రస్థాయితో పాటు ఇంటర్నేషనల్ స్థాయికి ప్రోత్సహిస్తామన్నారు. కాగా, క్రీడా పోటీలను అండర్ 14, అండర్ 17, అండర్ 19 వారీగా నిర్వహిస్తున్నారు. కబడ్డీ, వాలీబాల్, కోకో, టెన్నికాయిట్, హాకీ, క్యారమ్స్, బాల్ బ్యాట్మెంటన్, బాక్సింగ్, హ్యాండ్ బాల్, 100 మీటర్స్, 200 మీటర్స్, 1500 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్, 600 మీటర్స్ రిలే, 400 మీటర్స్ రిలే వివిధ విభాగాలకు సంబంధించిన క్రీడలను గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన గురుకులాల ఓఎస్‌డీ శ్రీనివాస్ కుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ రవి కుమార్, వివిధ జిల్లాలకు చెందిన రీజనల్ కో ఆర్డినేటర్స్, గిరిజన గురుకుల కళాశాల, పాఠశాలల ప్రిన్సిపల్స్, సుమారు వందమంది పీఈటీ, పీడీలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.