మెతుకు సీమలొ ఉద్దండులు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఉద్దండులు ఈ ఎన్నికల పోరులో తలబడుతున్నారు. ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి,– గజ్వేల్‌ నుంచి సీఎం కేసీఆర్‌, ఈటల..
– సిద్దిపేట నుంచి హరీశ్‌రావు
– అందోల్‌లో దామోదర..
– హుస్నాబాద్‌ నుంచి పొన్నం
– సంగారెడ్డిలో జగ్గారెడ్డి పటాన్‌చెరులో
– సీ పీఐ(ఎం) అభ్యర్థిగా కార్మికనేత మల్లికార్జున్‌
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఉద్దండులు ఈ ఎన్నికల పోరులో తలబడుతున్నారు. ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, కీలకమైన మంత్రి పదవుల్లో కొనసాగే అరడజన్‌కు పైగా ముఖ్య నేతలు పోటీ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), బీజేపీ ఎన్నికల యుద్ధ రంగంలో దూకాయి. ప్రజల ఆశీర్వాదం కోసం అందరూ నువ్వా నేనా అన్నట్టుగా పోరాడుతున్నారు. వీరిలో ఓటమెరగని నేతలున్నారు. ప్రధానంగా మూడు పార్టీల నుంచి ముఖ్య నేతలు పోటీ చేస్తుండటంతో ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎన్నికల వార్‌ వన్‌సైడ్‌ అవుతుందా..? నువ్వా నేనా అన్నట్టు సాగుతుందా..? అన్న ఆసక్తి నెలకొంది.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌ నుంచి మూడోసారి పోటీ చేస్తుండగా.. సీనియర్‌ కీలక మంత్రి తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేట నుంచి ఏడోసారి తలపడుతున్నారు. కేసీఆర్‌ గజ్వేల్‌ నియోజకవర్గంతోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నారు. 2014లో గజ్వేల్‌ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన మూడోసారి బరిలో దిగారు. నియోజకవర్గంలో ఆయన నేరుగా ఎన్నికల ప్రచారం చేయకపోయినా ముఖ్య నాయకులే కేసీఆర్‌ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ హాట్రిక్‌ కొట్టడం ఖాయమని బీఆర్‌ఎస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఆయన్ను ఓడించి తీరుతామంటూ బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు సవాల్‌ విసురుతున్నారు. తన్నీరు హరీశ్‌రావుకు సిద్దిపేటలో ధీటైన అభ్యర్థి లేకపోవడంతో లక్షకు పైగా మెజార్టీ వచ్చే అవకాశముందని బీఆర్‌ఎస్‌ వాళ్లంటున్నారు. తాను గెలవడమే కాదు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అన్ని స్థానాల్ని గెలిపించడం బాధ్యతగా భావిస్తున్న హరీశ్‌రావు ఏ మేరకు సక్సెస్‌ అవుతారో అన్న చర్చ నడుస్తోంది. మెదక్‌ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి, నారాయణఖేడ్‌ నుంచి మహారెడ్డి భూపాల్‌రెడ్డి, పటాన్‌చెరు నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి హాట్రిక్‌ విజయాల కోసం ప్రయత్నిస్తున్నారు. నర్సాపూర్‌లో మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ఈసారి బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్‌లో దామోదర.. జగ్గారెడ్డి.. పొన్నం..
కాంగ్రెస్‌ నుంచి కూడా పెద్ద నాయకులు ఎన్నికల బరిలో ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏఐసీసీ సభ్యులు దామోదర రాజనర్సింహ అందోల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. మూడుసార్లు గెలిచిన ఆయన వైఎస్సార్‌ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. గత రెండు ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన ఈసారి గెలిచి తీరాలన్నట్టు పనిచేస్తున్నారు. సంచలన ప్రకటనలకు కేంద్ర బిందువైన సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తన నియోజకవర్గంలో వార్‌ వన్‌ సైడే అంటున్నారు. హుస్నాబాద్‌ నుంచి మాజీ ఎంపీ, బీసీ నేత పొన్నం ప్రభాకర్‌ పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపీ సురేష్‌ షేట్కర్‌ నారాయణఖేడ్‌ నుంచి, మాజీ మంత్రి డాక్టర్‌ చంద్రశేఖర్‌ జహీరాబాద్‌, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి కొడుకు మైనంపల్లి రోహిత్‌ మెదక్‌ నుంచి పోటీ చేస్తున్నారు.
పటాన్‌చెరులో సీపీఐ(ఎం)
పారిశ్రామికవాడ పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) పోటీ చేస్తోంది. రాష్ట్రంలో 19 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ పటాన్‌చెరు నుంచి కార్మికోద్యమ నాయకులు జొన్నలగడ్డ మల్లికార్జున్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. బీఫామ్‌ అందుకున్న ఆయన ఎన్నికల ప్రచారంలోకి దిగారు. సీపీఐ(ఎం) ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార రంగాన్ని సిద్దం చేశారు. పారిశ్రామిక వాడగా ఉన్న బొల్లారం, పాశమైలారం, పటాన్‌చెరు, రామచంద్రాపురం ప్రాంతాల్లో ఉద్యోగ, కార్మికవర్గ పోరాటాలు నడిపిన సీపీఐ(ఎం) ఎన్నికల పోరాటంలోనూ ఫలితం సాధించేందుకు ముందుకు సాగుతోంది.
సీఎంతో తలపడుతున్న ఈటల
సీఎం కేసీఆర్‌ను ఓడించి తీరుతానన్న పంతంతో ఉన్న బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ గజ్వేల్‌లో తలపడుతున్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకే హుజూరాబాద్‌తోపాటు గజ్వేల్‌లో పోటీ చేస్తున్నట్టు చెబుతున్నారు. బీజేపీలో కీలక నేతగా ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు రెండోసారి గెలుపు కోసం పోటీ చేస్తున్నారు. అందోల్‌ నుంచి మాజీ మంత్రి బాబుమోహన్‌ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.