ఆదిలాబాద్ లో 48 గంటలపాటు మధ్యాహ్న భోజనం బంద్..

Mid-day meal bandh for 48 hours in Adilabad– కలెక్టరేట్ ఎదుట 16, 17న మహాధర్నా
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనం, గుడ్ల బిల్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16, 17న కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపడుతూ 48 గంటల పాటు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటలు బంద్ చేస్తున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల చిన్నన్న తెలిపారు. గురువారం పట్టణంలోని సుందరయ్య భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాల చిన్నన్న మాట్లాడుతూ..ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.పది వేలు ఇవ్వాలని, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించగలరని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. గుడ్లకు బడ్జెట్ కేటాయించాలని లేదా అంగన్ వాడీ సెంటర్లకు పంపిణీ చేసినట్లు పంపిణీ చేయాలన్నారు. అవసరమైన గ్యాస్ సబ్సిడీకి ఇవ్వాలని,  గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలన్నారు. సామాజిక భద్రత కల్పించాలని మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయ పాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వరాదన్నారు.  ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా బ్యాంక్ ద్వారా రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో మధ్యాహ్న భోజన కార్మికులు సంగీత, కవిత, నాయకులు పాల్గొన్నారు.