విద్యార్థులకు మధ్యాహ్న భోజన చార్జీలు పెంచాలి

– ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పొదల లవకుమార్
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్ : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల మధ్యాహ్న భోజన చార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పొదల లవకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం రఘునాథపల్లి మండల ఎంఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఎంఈఓకు అందజేశారు. రాష్ట్రంలో పెరిగిన ధరలకు అనుకూలంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన చార్జీలను పెంచాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులకు గదులలో ఫ్యాన్సు లేవన్నారు. లైట్స్ కూడా సరిగా లేవన్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం పూట భోజనం చేశాక తాగుదామంటే కనీసం త్రాగునీరు కూడా లేని దుస్థితి దాపురించిందనీ అన్నారు. అంతేకాకుండా మరుగుదొడ్లు కూడా సరిగా లేవన్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలు శిథిలావస్థలో చేరాయని, ఎప్పుడు కులుతాయోనని విద్యార్థులు భయభ్రాంతులతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కందుకూరి వంశీ, తేజ, బైరపాక శివక్రిష్ణ, అఖిల్, శ్రీలక్ష్మి, శ్రీజ, నిషిత, ధనశ్రీ, తదితరులు పాల్గొన్నారు.