యుద్ధోన్మాదాన్ని తరిమికొట్టాలి

– మాజీ ఎమ్మెల్సీ కే యాదవరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భూగోళం మీద యుద్ధోన్మాదం, సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టేందుకు శక్తివంతమైన యువతరం ముందుకు రావాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ నేత, మాజీ ఎమ్మెల్సీ కే యాదవరెడ్డి అన్నారు. ప్రపంచశాంతి కవి సమ్మేళనం శనివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. దీనిలో పాల్గొన్న కవులు ప్రపంచ శాంతిపైకవితలను వినిపించారు. ఇజ్రాయిల్‌, అమెరికా యుద్ధోన్మాదం, పాలస్తీనా, ఉక్రెయిన్‌, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాలను ఖండించారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ కవులు తమ కవిత్వం ద్వారా సమాజాన్ని మార్చగలిగే శక్తివంతులని అన్నారు అంతర్జాతీయంగా జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలను కవులు గ్రహించి రచనలు చేయాలని ఆకాంక్షించారు. డాక్టర్‌ డీ సుధాకర్‌ మాట్లాడుతూ యుద్ధాలను నివారించాలన్నారు. రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవియల్‌ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. రమేష్‌చంద్ర శాంతి అవార్డును కే యాదవరెడ్డికి అందచేశారు. సీనియర్‌ నాయకులు జీ రఘుపాల్‌, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.