ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆరోగ్యానికి సంబంధించి మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. అందులో భోజనం తిన్న తర్వాత టీ లేదా కాఫీ ఎందుకు తాగకూడదో వివరించింది. టీ, కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలు. భారతదేశంలో ప్రజలు టీ లేదా కాఫీ తాగడానికి ఆసక్తి చూపుతారు. కాఫీ, టీలు భోజనానికి గంట ముందు, భోజనానికి గంట తర్వాత అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఐసీఎంఆర్ వెల్లడించింది.
ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాల్లో పాలతో టీ తాగే బదులు, పాలు లేని టీ తాగడం మేలని చెప్పింది. గ్రీన్ లేదా బ్లాక్ టీ మరింత ప్రయోజన కరంగా ఉంటుందని కూడా ఐసీఎంఆర్ పేర్కొంది. నిజానికి పాలు కలపని టీలో థియోబ్రోమిన్ , థియోఫిలిన్ ఉంటాయి. ఇవి ధమనులను సడలిస్తాయి. తద్వారా రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి. అవి ఫ్లేవనాయిడ్లు, ఇతర యాంటీఆక్సిడెంట్ పాలీఫెనాల్స్‌ను కూడా కలిగి ఉంటాయి. ఇవి కరోనరీ హార్ట్ డిసీజ్ , కోలన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే, టీలో పాలు కలపకపోతే లేదా తక్కువ పరిమాణంలో పాలు కలిపినప్పుడు మాత్రమే ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చని ఐసీఎంఆర్ తెలిపింది.