బీజేపీకి లాభం చేకూర్చడానికే ఎంఐఎం థర్డ్‌ ఫ్రంట్‌

– రెండు ఫ్రంట్లకు సమానదూరమనే బీఆర్‌ఎస్‌ వైఖరి కూడా ఈ కోవలోనిదే..
– సెక్యులర్‌ శక్తులను ఏకం చేయడమే ప్రత్యామ్నాయం : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో మూడో ఫ్రంట్‌ను సీఎం కేసీఆర్‌తో కలిసి ఏర్పాటు చేస్తామని ఎంఐఎం అధినేత, పార్లమెంట్‌ సభ్యులు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించడం మతోన్మాద బీజేపీకి ఉపయోగపడేలా ఉందని సీపీఐ(ఎం) పేర్కొంది. ఈ చర్య మత ప్రాతిపదిక రాజకీయాలకు మేలు చేసి, దేశ సమైక్యత, సమగ్రతకు నష్టం కల్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని రెండు ఫ్రంట్‌లకు సమదూరం పాటిస్తామని బీఆర్‌ఎస్‌ ప్రకటించడం కూడా బీజేపీకి దోహదపడే చర్యేనని వివరించింది. ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకునే ధోరణి, వైఖరులను పార్టీ రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో జరిగిన అనేక శాసనసభల ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చి ఆ పార్టీకి లాభం చేకూర్చిందని గుర్తుచేశారు. ఫలితంగా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో సెక్యులర్‌ ఓట్లు చీలిపోయాయని తెలిపారు. తాజాగా థర్డ్‌ ఫ్రంట్‌ అనే ప్రకటన కూడా అందులో భాగమేనని విమర్శించారు.
ప్రతీ ఎన్నికల సందర్భంలోనూ ఎంఐఎం వైఖరి ఇదే విధంగా ఉండటాన్ని గమనించాలని కోరారు. దేశంలో బీజేపీ మతోన్మాద ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సెక్యులర్‌ శక్తులు ఒక్కటై ఎన్డీఏ కూటమిని ఎదుర్కొంటుంటే, ఎంఐఎం చెప్పే థర్డ్‌ ఫ్రంట్‌ వల్ల ఎవరికి లాభం? అని ఆయన ప్రశ్నించారు. మరోపక్క యూనిఫాం సివిల్‌ కోడ్‌, ఎన్నార్సీ వంటి చట్టాలను తెచ్చి దేశంలోని మైనార్టీల హక్కులు కాలరాయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని గుర్తుచేశారు. అలాంటి పార్టీకి మేలు చేసే విధంగా ఎంఐఎం వ్యవహరించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అదే సందర్భంలో బీజేపీ వ్యవహరిస్తున్న పద్థతిలోనే
ఎంఐఎం వ్యవహారశైలి కూడా మత రాజకీయాలు బలపడే విధంగా ఉండటం దేశానికి హాని కలిగిస్తున్నదని తెలిపారు. అందువల్ల మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రోత్సహించే బీజేపీకి వత్తాసు పలికే విధంగా ఎంఐఎం వ్యవహరించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. రెండు ఫ్రంట్లకు సమానదూరమనే బీఆర్‌ఎస్‌ వైఖరి కూడా ఈ కోవలోనిదే..