ఇంటికి చుట్టాలు వస్తుంటరు పోతుంటరు. సాధారణంగా పోయివస్తం అని చెప్పి తిరిగి వెళ్లిపోయేప్పుడు ‘ఇయ్యాల ఎందుకు రేపు పోరాదుండ్రి’ అని ఇంకో రోజు ఉండమంటరు. కాని కొందరికి చుట్టాలు ఎప్పుడు వెళ్లిపోతరా అని చూస్తరు. అటువంటి వాల్లు వెళ్లుతున్నప్పుడు ‘పోయేంత పొద్దు మా ఉన్నది గని మరి రేపు పోతవా’ అన్నడట. మాట పోకుంట రేపు పోతవా అని అన్నట్టే అట్లనే పోయేంత పొద్దు ఉన్నది ఇగ పో అని సంకేతం ఇచ్చినట్లు మాట్లాడుతుంటరు.
మరికొందరైతె ఇగ పోతన్నం అంటే మోచేయి కాడ చెయి పట్టుకుని ‘ఉండరాదు రేపు పొండ్రి’ అని మీద మీద అంటరు. మోచేయి పట్టుకుని అంటండు అంటేనే పోయే అతను చెయ్యి ఇటు తిప్పంగనే విదుల్చుకుందుకు అనే చర్య రావాలని ఎదిరి చూస్తున్నట్టు లెక్క.
కొందరు చుట్టాలు గమ్మతి వుంటరు. మేమే పెద్ద అని నీల్గుతరు. రమ్మంటె రారు, పొమ్మంటె పోరు. ఇదంత అంతరాల అహంకారాల గోల. ఇలాంటి వాల్లను ‘చూడబోతె చుట్టాలు రమ్మంటే కోపాలు’ అని అంటరు. వాల్లతో ఎట్ల మాట్లాడినా తిప్పలే వుంటది. మరొక సందర్భంలో ‘చుట్టం వచ్చిండంటే చెప్పులెక్కడ ఇడ్సిండో చూసి రమ్మన్నడట’ అనే సామెత పుట్టింది. మరికొందరు ఇంటికి చుట్టాలు వస్తె వాల్లనే పైసలు కావాలెనని అప్పులు అడిగేవాల్లు కూడా ఉన్నరు. వాల్లను చూసి ‘చుట్టమై వస్తె దయ్యమై పట్టిండు’ అని అంటరు. అయితె చుట్టం మధ్యనున్న వైనం తొందరగా తెగిపోతది.
– అన్నవరం దేవేందర్, 9440763479