– 30వేలకు పైగా వచ్చిన భక్తులు
– వనదేవతలకు ముందస్తు మొక్కులు
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో మినీ జాతర సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 30వేలకు పైగా భక్తులు మంగళవారం తరలివచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. వచ్చేనెల ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీజాతర(మండమెలుగు) పండుగకు ముందుగానే భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రవేటు వాహనాలలో మేడారం చేరుకున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. అనంతరం వనదేవతల గద్దెలకు చేరుకొని నిలువెత్తు బంగారం(బెల్లం), పసుపు కుంకుమ, చీరెసారెలు, కొబ్బరికాయలు, పూలు, పండ్లు తల్లులకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 30వేలకు పైగా భక్తులు మేడారం అమ్మవార్లను దర్శించుకున్నారని దేవాదాయ శాఖ ఈవో రాజేంద్రం తెలిపారు. భక్తులు తల్లులను సంతోషంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.