మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం కల్పించాలి

– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు రమ 
-16న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు
నవతెలంగాణ – ఆమనగల్
మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు రమ డిమాండ్ చేశారు. ఆమనగల్ పట్టణంలోని విద్యావనరుల కేంద్రంలో సోమవారం జరిగిన మధ్యాహ్న భోజన కార్మికుల ప్రత్యేక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్మికుల సమ్మె‌లో అందరూ భాగస్వాములై సమ్మెను జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం ప్రవేట్ స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం 2022 చట్టాన్ని రద్దు చేయాలని, గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించి వంటకు సరిపోయే సిలిండర్లు,  సరుకుల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు అందజేయాలన్నారు.  రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు అరికట్టాలన్నారు. వంట షెడ్లు, వంట పాత్రలు, కాటన్ దుస్తులు, సామాజిక భద్రతతో పాటు ప్రమాద బీమా, పీఎఫ్ ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈసమావేశంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, ప్రజా సంఘాల నాయకులు కాన్గుల వెంకటయ్య, పిప్పళ్ళ శివశంకర్, మండల అధ్యక్షురాలు పద్మ, గోజీ, లక్ష్మమ్మ, అలివేలు, ఆమనగల్, కడ్తాల్ మండలాల మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.