నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని కోరారు. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని గుర్తుచేశారు. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్నట్టు చెప్పారు. హౌటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వర్క్ షాప్‌ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హౌటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై మంత్రి ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించారు.