
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.శనివారం రాష్ట్ర,ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని పట్టణంలో ఎన్.ఏ.సి ను సందర్శించి మహిళలకు రెండవ బ్యాచ్ కుట్లు, అల్లికల శిక్షణను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ కుట్లు, అల్లికలను సంపూర్ణంగా నేర్చుకోవాలని, వివిధ డిజైన్లలో మహిళల దుస్తులుకుట్టడం, డిజైన్లు రూపొందించడం నేర్చుకుంటే గణనీయంగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రతి బ్యాచ్ లో శిక్షణకు వచ్చే మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తున్నామని,మహిళలు శిక్షణను సంపూర్ణంగా వినియోగించుకుంటూ, తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ఆదాయం అర్జించాలన్నారు. మంచి టెయిలరింగ్ నైపుణ్యం ఉన్న వారికి మార్కెట్ లో మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.మంథని ఎన్.ఏ.సి లో శిక్షణ పొందే మహిళలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించడం జరుగుతుందని, మహిళల అభ్యర్థన మేరకు వెంటనే స్టాండింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్.ఏ.సి ఇంచార్జి బి.రజిత, మహిళలు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.