– బీఆర్‌ఎస్‌లో చేరిన మన బిన్ ఫౌండేషన్ అధినేత, ప్రముఖ న్యాయవాది ఎంఏ ముఖిమ్
నవతెలంగాణ- సదాశివపేట
ఈసారి ఎన్నికల్లో సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ జెండా ఎగరేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బుధవారం మన బిన్ ఫౌండేషన్ అధినేత, సుప్రీంకోర్టు అడ్వకేట్ ముఖిమ్ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. సదాశివపేట పట్టణంలోని ముర్షత్ దర్గా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయవాది ముఖిమ్ సాబ్, కౌన్సిలర్ ఇలియాస్ షరీఫ్, టీజేఏసీ జిల్లా అధ్యక్షులు సత్తయ్య యాదవ్, అనుచరులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి ఐదేండ్ల నుంచి ప్రజల కంటికి కూడా కనపడకుండా పోయారన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా, ఇప్పుడొచ్చి నాకు ఓటేస్తే వచ్చే పదేండ్లలో సీఎం అవుతానని ప్రజలను మభ్య పెట్టడం సరికాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటేనని విమర్శించారు. ఆరోగ్యం బాలేకున్నా ప్రజల మధ్యలో ఉన్న నాయకుడు చింతా ప్రభాకర్ అన్నారు. చింత ప్రభాకర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మెన్ చింతా ప్రభాకర్, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్, సీడీసీ చైర్మెన్ బుచ్చిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల సర్పంచులు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.