అవినీతికి నిలయంగా మంత్రి జగదీశ్‌రెడ్డి

– బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టెజానయ్యయాదవ్‌
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అవినీతికి నిలయంగా మారారని బీఎస్పీ సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టెజానయ్యయాదవ్‌ ఆరోపించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు.బహుజన బిడ్డగా తనను గుర్తించి ప్రతిఒక్కరూ తన గెలుపు కోసం కషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే బడుగు, బలహీన వర్గాల అభివద్ధి చెందుతాయని భావిస్తే అగ్రకులాలకు చెందిన నాయకులు అభివద్ధి చెందారని విమర్శించారు.కెేసీఆర్‌ దళిత ముఖ్యమంత్రి చేస్తానని పదేండ్లపాటు పాటు రాజ్యమేలాడని ఆరోపించారు.దళితులకు మూడెకరాల భూమి, ప్రతి పేదవారికి డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, ఇంటికి ఒక ఉద్యోగం పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు.తెలంగాణ కోసం ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాల నాయకులకు అందిస్తున్నారని ఇలాంటి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.2014 కు ముందు ఏమి లేని మంత్రి ప్రస్తుతం రూ.1.50 కోట్లతో కొనుగోలు చేసిన కార్లలో ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారో నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు.మంత్రి తన బంధువు పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీ, కలెక్టరేట్‌ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్‌ ద్వారా నియమించిన ఉద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద 3 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేశారని ఆరోపించారు. కలెక్టరేట్‌ కార్యాలయం నిర్మాణంలో సైతం 500 కోట్ల రూపాయల వరకు కుంభకోణం చేసినట్టు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ మోడ్రన్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌లో వ్యాపారులు వ్యాపారం చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో 6వ వార్డు కౌన్సిలర్‌ ధరావత్‌ నీలాబాయి లింగానాయక్‌, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు చాంద్‌పాషా, బీఎస్పీ జిల్లా నాయకులు ఆవుల అంజయ్య, పెన్‌పహాడ్‌ మండల అధ్యక్షులు భీమపంగు రాజు తదితరులు పాల్గొన్నారు.