– అవసరమైతే రుణ సహాయం అందిస్తాం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్గొండ జిల్లాలో అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ ఛాంబర్లో వి హబ్ ద్వారా నల్గొండ జిల్లాలో నైపుణ్యాల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చించారు. జిల్లాలో నిమ్మ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధికి, అదేవిధంగా మట్టి కుండలు, బాటిళ్ల తయారీకి అవకాశాలు ఉన్నాయని, అదే విధంగా ఇతర రంగాలలో నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. వి హబ్ ప్రోగ్రామ్ మేనేజర్ ఊహ, వి హబ్ డైరెక్టర్ నల్గొండ జిల్లా లో స్వయం సహాయక మహిళా బృందాలు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, మధ్యలో బడి మానేసిన వారు, అదే విధంగా ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్నవారు విద్యార్థులకు వివిధ రకాల శిక్షణను ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వం ఇదివరకు రూపొందించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోగ్రాం కింద కార్యక్రమాలను చేపట్టి నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆస్కారం ఉందని తెలుపగా, మంత్రి మాట్లాడుతూ వారం, పది రోజుల్లో ఐటీ టవర్లో శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని, అవసరమైతే రుణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మునుగోడులో తాటి బెల్లం తయారీ, ఇతర ఉత్పత్తుల తయారీకి ప్రణాళిక రూపొందించాలని, నల్గొండ జిల్లా కేంద్రంలో నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన ఒక కేంద్రాన్ని ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, అదనపు కలెక్టర్లు టీ. పూర్ణచంద్ర, జె. శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, డిఆర్డిఓ నాగిరెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.