అర్హులకు పోడు భూముల పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ

Steps should be taken to give title deeds to deserving people: Minister Konda Surekha– పెండింగ్ దరఖాస్తు వివరాలను అందజేయాలి 
– ఎక్కడా నూతన ఆక్రమణలు జరగడానికి వీల్లేదు 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
అర్హులకు పోడు భూముల పట్టాలు అందించేందుకు చేపటిష్ట కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కోండా సురేఖ తెలిపారు.  శనివారం  ఆమె హైద్రాబాద్ నుండి  రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క)తో కలిసి  పోడు భూముల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు ఆమోదించిన ఆర్ఓఎఫ్ఆర్  దరఖాస్తుల పట్టాలు లబ్ధిదారునికి చేరాయో లేదో నివేదిక అందించాలని ,  ఇప్పటివరకు పంపిణీ చేసిన పోడు పట్టాల వివరాలు, పెండింగ్ ఉన్న దరఖాస్తులు, ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో  సాగు జరుగుతున్న అటవీ భూముల వివరాలతో కూడిన నివేదిక అటవీశాఖ, గిరిజన శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా రూపొందించి సమర్పించాలని మంత్రి ఆదేశించారు. పోడు భూముల పట్టాల కోసం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అర్హత ఉంటే వారికి పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని, సదరు దరఖాస్తును తిరస్కరించే పక్షంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ నివేదిక అందించాలని అన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం గతం నుంచి సాగు చేసుకుంటున్న అటవీ భూములకు మాత్రమే పట్టాలు అందించాలని, కొత్తగా రాష్ట్రంలో ఇంచ్ అటవీ భూమి కూడా సాగు చేయడానికి వీలు లేదని, అటవీ భూముల సంరక్షణకు అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నూతన ఆక్రమణలు జరగడానికి వీలులేదని మంత్రి స్పష్టం చేశారు.
ఆర్ఓఎఫ్ఆర్ చట్టం పై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర గిరిజనులకు, ఆదివాసీలకు మాత్రమే పట్టాలు మంజూరు చేయాలని, వలస వచ్చి నూతనంగా అటవీ ప్రాంతంలో చెట్లు నరికివేత చేయాలని చూస్తే కఠినంగా వ్యవహరించాలని మంత్రి పేర్కొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ.. గిరిజనులకు అటవీశాఖ వ్యతిరేకం అనే భావన తొలగించే విధంగా  పని చేయాలని అన్నారు.  అటవీ భూముల్లో స్మగ్లింగ్ జరగకుండా పక్కా నిఘా ఏర్పాటు చెయ్యాలని మంత్రి  సీతక్క ఆదేశించారు.పెండింగ్ పోడు భూముల పట్టా దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని సూచించారు.  ఆర్ఓఎఫ్ఆర్ చట్ట ప్రకారం అర్హులందరికీ పట్టాలు అందజేయాలని తెలిపారు. అటవీ భూముల అనుమతుల కారణంగా గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనుమతులు త్వరగా వచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టాలని  మంత్రి ఆదేశించారు. పట్టాలు మంజూరు చేసిన పోడు భూములలో రైతులు పామ్ ఆయిల్, జీడి మామిడి తోటలు మొదలగు లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులకు అవసరమైన  సహకారాలు, సూచనలు అందించాలని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు డిఎఫ్ఓ రాజ శేఖర్, జిల్లా అదనపు కలెక్టర్   జె.శ్రీనివాస్, జిల్లా గిరిజన  సంక్షేమ అధికారి, హోసింగ్ పిడి రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.