నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విదేశాల్లో ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు చేరుకున్నట్టు సమాచారం. గత నెల 19న ఆయన అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకు సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. అయితే టికెట్ దక్కని వారు, ఆశావహులు కేటీఆర్ రాక కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఆయన వచ్చాక సంప్రదింపులు, చర్చలు జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని వారు నిర్ణయించుకున్నారు. కాగా కేటీఆర్ ఈ నెల ఒకటినే హైదరాబాద్‌కు తిరిగి రావాల్సింది. కానీ ఆ ప్రయాణం వాయిదా పడింది. గురువారం (7న) ఆయన ఇక్కడికి చేరుకుంటారని వార్తలొచ్చాయి. కానీ మంత్రి బుధవారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు చేరుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విమానాశ్రయంలో ఫ్లయిట్ దిగిన ఆయన నేరుగా ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్లినట్టు తెలిసింది. మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కె.సంగ్మా హైదరాబాద్‌కు బుధవారం విచ్చేశారు. ఆ సమయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో సాగునీటి పారుదల శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అందువల్ల సంగ్మా కేసీఆర్‌ను కలవడానికి వీలు పడలేదు. దీంతో కేటీఆరే ఆయనకు స్వాగతం పలికి టీ- హబ్, వీ-హబ్ కార్యాలయాలకు తోడ్కొని వెళ్లినట్టు సమాచారం. కానీ, ఈ విషయాలను ఇటు తెలంగాణ భవన్ గానీ, అటు మంత్రి కార్యాలయం గానీ బుధవారం అర్థరాత్రి వరకు ధృవీకరించకపోవడం గమనార్హం.
దుబాయ్ లో తెలంగాణ ఎన్నారైల క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు
– మంత్రి కేటీఆర్ కార్యాలయం
దుబారులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల క్షమాభిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వారి క్షమాభిక్ష కోసం మంత్రి దుబారు భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయ అధికారులు, దుబారు ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్బు లాయర్ తదితరులతో సమావేశమయ్యారు. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న మంత్రి కేసు పురోగతి విషయాన్ని పలువురితో సమావేశమై తెలుసుకున్నారు. అంతకు ముందు వ్యాపారవేత్తలతో జరిగిన సమావేశంలోనూ మంత్రి వారి క్షమాభిక్ష కోసం ప్రయత్నిం చారు.