న్యూఢిల్లీ : తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ఎన్నికల్లో సీహెచ్ మల్లారెడ్డి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పులున్నాయంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ కందాడి అంజిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. 2014, 2018, 2023 ఎన్నికల్లో మల్లారెడ్డి సమర్పించిన వేర్వేరు అఫిడవిట్లలో విద్యాపరమైన అంశాలు భిన్నంగా ఉన్నాయని పిటిషనర్ ఆరోపించారు. రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో అంజిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంజిరెడ్డి తరఫు అడ్వొకేట్ ఆన్‌రికార్డ్స్ ఆనంద్ దిలీప్ వాదనలు వినిపిస్తూ.. అఫిడవిట్‌లో విద్యా పరమైన అర్హతల్లో 2014లో కళాశాల పేరు, 2018, 2023ల్లో తేడాగా ఉందని, వయసు కూడా తప్పుగా ఉందని ఆరోపించారు. ఆర్వోకు ఫిర్యాదు చేసినా, హైకోర్టుకు వెళ్లినా ఆశించిన ఫలితం రాలేదని తెలిపారు. అఫిడవిట్‌లో వెరిఫైడ్ ఎట్, డేట్ అనే కాలమ్స్ కూడా మల్లారెడ్డి పూర్తి చేయలేదని, ఎన్నికల కమిషన్‌ను ప్రజల్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రిట్ దాఖలు చేయకూడదని, ప్రజా ప్రాతినిధ్య చట్టం ద్వారా వెళ్లాలని హైకోర్టు చెప్పిందని ధర్మాసనం దష్టికి తీసుకొచ్చారు. ఆనంద్ దిలీప్ వాదనల్ని కేవియేటర్ మల్లారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, రమేష్ అల్లంకిలు తోసిపుచ్చారు. మల్లారెడ్డి రెండు అఫిడవిట్లు దాఖలు చేశారని పిటిషనర్ ఒక అఫిడవిట్ చూసి వివరాలు లేవని భావించారని కోర్టు దష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఈ కేసులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.