– హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా..
– విద్యా, వైద్యం, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం
– పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కృషి: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గ్రామాలలో ప్రజాప్రతినిధుల పదవి కాలం పూర్తయినందున అధికారులే ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుందా కృషి చేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హుస్నాబాద్ లోని ఐఓసీ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పై సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో ఐదు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న చేనేత, వ్యవసాయ ఆధారిత రంగాలతో పాటు పలు పథకాలను రైతులు పేద వర్గాలకు అందేలా చొరవ చూపాలని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో రోడ్ల పరిస్థితి తాగునీటి వ్యవస్థ, ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థితిగతులపై అధికారులంతా ఒక రూట్ మ్యాప్ తయారుచేయాలని ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కుటీర పరిశ్రమల కల్పనకు కృషి చేస్తానని వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. హుస్నాబాద్ తో పాటు ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా అధికారులు పకడ్బందీగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అధికారులు రూపొందించాలని, ఇందుకు నిధులు మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. ఆన్ గోయింగ్ వర్క్స్ కు సంబంధించిన పనులు వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. గౌరవెల్లి, దేవాదుల, ఎస్సారెస్పీ మిడ్ మానేర్ ప్రాజెక్టుల ద్వారా హుస్నాబాద్ రైతాంగానికి సాగునీరు అందేలా ప్రత్యేక కృషి చేస్తానని చెప్పారు.
సాగునీటికి రైతులు ఇబ్బందులు పడకుండా చూస్తానని తెలిపారు.నియోజకవర్గంలో విద్యా, వైద్యం వ్యవసాయము, పాడిపంట, వ్యవసాయ ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఇక్కడ పాల ఉత్పత్తి అధికంగా జరుగుతున్నదని, పశుసంపద పరిరక్షణకుఅధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు, నిరుద్యోగులు యువత స్వయం ఉపాధికి చేపలు, గొర్లు, మేకల పెంపకం తో పాటు డైరీ ఫామ్స్ ఏర్పాటుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హుస్నాబాద్ నుంచి చేపలు మేకలు, గొర్లు హైదరాబాద్ కు ఎగుమతి చేసేలా ప్రత్యేక దృష్టి సారిస్తానని మంత్రి పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంతం టూరిజం స్పాట్ కు అనుకూలంగా ఉందని తెలిపారు. ఈ మేరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ దేవాలయం, శనిగరం ప్రాజెక్టు, మహాసముద్రం, రాయికల్ జలపాతం సర్వాయిపేట, పీవీ నరసింహారావు స్వగ్రామం వంగర, కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయం పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హుస్నాబాద్ ను పర్యటకంగా అభివృద్ధి చేస్తే మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యుత్ సరఫరా లో ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. గౌరవెల్లి, దేవాదుల ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన మేరకు ఆయకట్టుకు సాగునీరు అందించేలా సత్వరమే అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు 24 గంటల అందుబాటులో ఉంటానన్నారు. పంచాయతీరాజ్ అధికారులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. స్వశక్తి సంఘాల బలోపేతానికి అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు మిక్కిలినేని మను చౌదరి, పమేలా సత్పతి, ప్రావీణ్యతో పాటు అదనపు కలెక్టర్లు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.