నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1,335 మంది కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్ల సంఘం (టీఆక్టా) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎం రామేశ్వరరావు నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 16 ప్రకారం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసిందని గుర్తు చేశారు. అదే పద్ధతిలో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులందర్నీ రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆక్టా నాయకులు పల్లా రేష్మరెడ్డి, జి వెంకటేశ్వర్లు, రాజేష్ ఖన్నా, సోమేశ్, దశరథం, యాదగిరి, కర్నాకర్‌రెడ్డి, వెంకటేశ్, నరేందర్, శరత్, సుదర్శన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.