మేడారం బస్‌స్టాండ్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క

మేడారం బస్‌స్టాండ్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క– మహా జాతరకు ఆరు వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
– మహిళా భక్తులకు ఉచిత ప్రయాణం
నవతెలంగాణ-ములుగు
మేడారం జాతర కోసం ప్రత్యేకంగా అరవై ఎకరాల స్థల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బస్‌స్టాండు ప్రాంగణాన్ని మంత్రి అనసూయ సీతక్క.. జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ ప్రత్యేకంగా ఆరువేల బస్సులు నడపడానికి సిద్దంగా ఉంచిందన్నారు. జాతరకు వచ్చే ప్రయాణికుల రద్దీతో పాటు మహిళా సందర్శకుల కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గత జాతరతో పోలిస్తే ఈ సారి ఎక్కువ మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని, వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అరవై ఎకరాల విస్తీర్ణంలో సువిశాల బస్‌స్టాండ్‌ ప్రాంగణం ఏర్పాటు చేశామన్నారు. ఈ 18 నుంచి 25 వరకు సందర్శకుల కోసం ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.శ్రీజ, ఏటూరునాగారం అదనపు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌, వరంగల్‌ ఆర్‌ఎం శ్రీలత, స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.