– ఫ్యాక్టరీని పరిశీలించిన కమిటీ
నవతెలంగాణ-బోధన్
బోధన్ నిజాంషుగర్ ఫ్యాక్టరీని తప్పనిసరిగా పునరుద్ధరిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ సిఫార్సుల కమిటీ సభ్యులతో కలిసి శనివారం బోధన్ పట్టణంలోని నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ఆవరణలో రైతులతో ముఖాముఖిలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం బోధన్ నిజాంషుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కట్టుబడి ఉందన్నారు. చెరుకు పరిశ్రమ ప్రారంభం, చెరుకు పంట ఒకేసారి ప్రారంభం కావాలన్నారు. లాభాల్లో ఉండే విధంగా తిరిగి పరిశ్రమను తెరిపించేందుకు ప్రయత్నిస్తు న్నామని చెప్పారు. ట్రాన్స్‌పోర్టు, కొత్తవంగడాలపై దృష్టిసారిస్తామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అడ్డగోలు నిర్ణయాల వల్ల ఫ్యాక్టరీ మూత పడిందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఫ్యాక్టరీని తెరిపిస్తామ న్నారు. ప్రభుత్వం కార్మికులు, రైతుల పక్షాన ఉందన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. ఆయన వెంట వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులతోపాటు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్డీఓ రాజా గౌడ్, మున్సిపల్ చైర్మెన్ తూము పద్మావతి తదితరు లు ఉన్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత ఫ్యాక్టరీ గేటు తెరుచుకోవడంతో కార్మికులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.
కాలయాపన చేయొద్దు..
ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతిగాంచిన బోధన్ నిజాంషుగర్ ఫ్యాక్టరీని కాలయాపన చేయకుండా తక్షణమే పునరుద్ధరించాలని వామపక్ష పార్టీల నాయకులు శంకర్‌గౌడ్, వరదయ్య డిమాండ్ చేశారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ సభ్యులకు వారు వినతిపత్రాన్ని అందించారు. గత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన యాడాది లోనే ఫ్యాక్టరీని మూసివేసి కార్మికులను, రైతులను తీవ్రంగా నష్టపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వమైనా కార్మికులను, రైతులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే పరిశ్రమను పునరుద్ధరించాలని డిమాండ్‌చ ఏశారు. కార్మికుల బకాయి వేతనాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలన్నారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తేవడానికి సబ్ కమిటీ వేయడం సీపీఐ(ఎం)గా, వామపక్షాలుగా ఆహ్వానిస్తు న్నామన్నారు. స్థానికంగా ఉన్న యువతకు, కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ ప్రజాపంథా నాయకులు ప్రభాకర్, మల్లేష్, సీపీఐ(ఎం) ఏరియా కార్యదర్శి వై.గంగాధర్, సీపీఐ(ఎంఎల్) నాయకులు వరదయ్య, పోశెట్టి, గోపి శంకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక సంఘం నాయకుల ముందస్తు అరెస్ట్..
బోధన్ నిజాంషుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ ప్రతినిధులు వచ్చిన సందర్భంగా పోలీసులు నిజాంషుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు రవిశంకర్ గౌడ్ మాట్లాడుతూ.. కార్మికులు కమిటీకి వినతిపత్రం అందజేసేందుకు వస్తే ఏసీపీ శ్రీనివాస్ అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు.