తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల

నవతెలంగాణ-కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు – భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరుగని పోరాటాలు, అనేక త్యాగాల ఫలితంగా ఆరు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ద్యేయంగా కేసిఆర్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఇంటింటికి రక్షిత మంచినీరు, సాగు జలాలు, సేద్యానికి 24 గంటల విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు వంటి అనేక సంక్షేమాభివృద్ది కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పల్లె, పట్టణ ప్రగతితో గ్రామగ్రామాన పరిశుభ్రత, పచ్చదనం వెల్లివిరుస్తూ వరుసగా జాతీయ అవార్డులు వరిస్తుండడం తెలంగాణ ప్రగతికి ప్రామాణికంగా నిలుస్తోందన్నారు. గడిచిన తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనితరసాధ్యమైన అభివృద్ధి, సంక్షేమాన్ని ఆచరణాత్మకంగా నిరూపించిన తెలంగాణ ప్రభుత్వం, ఇదే స్ఫూర్తితో మరింత సమర్ధవంతమైన పాలన దిశగా ముందుకెళ్లాలనే సంకల్పంతో దశాబ్ది ఉత్సవాలను చేపడుతోందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం స్ఫూర్తితో రాష్ట్ర ప్రగతిలో సబ్బండ వర్ణాలు మమేకమవుతూ, దశాబ్ది ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.