– ఒకేరోజు వట్టెపై 71కి పైగా కేసులు
– జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
దాదాపు తొమ్మిదిన్నరేండ్ల పాటు సూర్యాపేట జిల్లాలో ఏకచక్రాధిపత్యం వహించిన బీఆర్‌ఎస్ కోటకు క్రమంగా బీటలు బారుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీలో తన మాటే వేదంగా సాగిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డిపై భారీస్థాయిలో విమర్శల పర్వం కొనసాగడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇన్నాళ్లూ మంత్రి ప్రధాన అనుచరునిగా ఉంటూ వచ్చిన డీసీఎంఎస్ చైర్మెన్ వట్టె జానయ్యయాదవ్ మంత్రికి ఎదురుతిరగడం.. గతంలో ఎన్నడూలేని విధంగా వట్టెపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటం వెనుక రాజకీయ కుట్ర కోణం దాగిందనే ప్రచారం లేకపోలేదు. ఈ నేపథ్యంలో సూర్యాపేట పట్టణంలో ఆదివారం ఒక్కసారిగా ధర్నాలతో వేడెక్కింది. అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ వట్టెకు మద్దతుగా కొంతమంది ధర్నా చేస్తే.. తమ భూములు తమకు ఇప్పించాలంటూ మరికొంతమంది జనగామ క్రాస్‌రోడ్డులో ధర్నాకు దిగారు. దాంతో పేటలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది.
పేటలో పోటాపోటీగా ఆందోళనలు..
మంత్రి జగదీశ్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ మధ్య రగిలిన చిచ్చు కాస్త రచ్చకెక్కింది. జానయ్యను అరెస్టు చేయాలంటూ బాధితులు పోలీసుస్టేషన్‌కు క్యూ కడుతున్నారు. జానయ్య భూఆక్రమణలను నిరసిస్తూ జనగామ క్రాస్‌రోడ్డులో బాధితులు ధర్నాకు దిగారు. అంతేకాదు, వట్టె నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ పలువురు బాధితులు ఆరోపించారు. మరోవైపు బడుగు బలహీన తరగతులకు న్యాయం చేయాలని అడిగినందుకు మంత్రి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వట్టెకు మద్దతుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. అనంతరం మంత్రి తీరును నిరసిస్తూ వందలాది మంది స్థానికులు మంత్రి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు.
వట్టె జానయ్యయాదవ్‌పై అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని ఆయన సతీమణి, సూర్యాపేట మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ వట్టె రేణుక డిమాండ్ చేశారు. బహుజన వాదం ఎత్తుకున్నందుకే మంత్రికక్షగట్టి తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. మంత్రి దగ్గర ఉన్నప్పుడు మంచివాడైన తన భర్త ఇప్పుడు ఎలా కబ్జాకోరు అయ్యాడో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క రోజు దాదాపు 71 కేసులు పెట్టడం వెనుక మంత్రి ప్రోద్బలం ఉన్నదని, తన భర్తకు ఏదైనా ప్రాణహాని జరిగితే దానికి బాధ్యత మంత్రి దేనని తేల్చిచెప్పారు. అనంతరం ఆమె జానయ్యయాదవ్ అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు ముందస్తుగా రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బారీకేడ్స్ ఏర్పాటు చేసి కట్టడి చేశారు. ర్యాలీగా వస్తున్న వారిని అరెస్ట్ చేస్తారని మొదట భావించినా.. పోలీసులు వారికి నచ్చజెప్పి వెనక్కు పంపించారు.
జగదీశ్‌రెడ్డి చిట్టా నా దగ్గర ఉంది
బడుగు, బలహీనవర్గాలకు సరైన న్యాయం చేయాలని అడిగితే.. నాపై కక్షగట్టారు. ఇన్నేండ్ల పాటు లేని కేసులు ఒక్కరోజే 60కి పైగా పెట్టారంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. నాపై వచ్చిన ఆరోపణలకు నేను బహిరంగ చర్చకు సిద్ధం. మంత్రి జగదీశ్‌రెడ్డి తొమ్మిదిన్నరేండ్ల కాలంలో అక్రమంగా సంపాదించిన రూ.వేల కోట్లు ఎక్కడ దాచిపెట్టారో వెలుగులోకి తీసుకొస్తా. నాడు స్కూటర్‌పై తిరిగిన వ్యక్తికి ఇన్ని రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ప్రశ్నిస్తే.. ఇంతకు దిగజారడం సరికాదు.
– వట్టె జానయ్యయాదవ్, డీసీసీఎంఎస్ చైర్మెన్