మంత్రులే ప్రశ్నలు అడగడమేంటి?

మంత్రులే ప్రశ్నలు అడగడమేంటి?– ప్రశ్నోత్తరాల అర్థాన్నే మార్చేస్తున్నారు
– సభలో కొత్త సంస్కృతిని తీసుకురావొద్దు : బీఆర్‌ఎస్‌ సభ్యులు టి.హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ మంత్రి మరో మంత్రిని ప్రశ్నలు అడగడమేంటి? అని బీఆర్‌ఎస్‌ సభ్యులు టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. క్యాబినెట్‌ నిర్ణయమంటేనే సమిష్టి నిర్ణయమనీ, దానికి భిన్నంగా ఇక్కడ ప్రశ్నలు అడగడమేంటి? అని నిలదీశారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణ సమస్యల గురించి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని పలు ప్రశ్నలు అడగటాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందనీ, సభలో కొత్త సంస్కృతిని తీసుకురావొద్దని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను కోరారు. ఇలా మరోమారు మైకులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీనే ఎక్కువ కాలం పాలించిం దన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నారనీ, వారి హయాంలోనే మూసీ మురికి కూపంగా మారిందని విమర్శించారు. అప్పుడు వారు సరిగ్గా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. మూసీ వల్ల నల్లగొండ జిల్లా ప్రజలు బాధపడుతున్నారంటే దానికి ప్రధాన ముద్దాయి కాంగ్రెస్‌ పార్టీయే అని స్పష్టం చేశారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్‌ 2 పనులు పూర్తిచేసి కాళేశ్వరం జలాలను ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు నియోజకవర్గాలకు సాగు, తాగు నీటిని అందించిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని చెప్పారు. నల్లగొండ జిల్లాకు కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసింది? తాము ఏం చేశాం? అనేదానిపై చర్చ పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నకు మంత్రులు సూటిగా జవాబు ఇస్తే బాగుంటుందని సూచించారు. అలాగైతే, పది ప్రశ్నలకు జవాబులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మంత్రులు, అధికార పార్టీ సభ్యులు సుధీర్ఘ ప్రసంగాల వల్ల ప్రతిరోజు మూడు నాలుగు ప్రశ్నలకే సభాసమయం సరిపోతుందన్నారు. ఒక్కో ప్రశ్నకు సూటిగా సమాధానం వచ్చేలా చూడాలన్నారు. మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే తాము కల్పించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.