
శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలుపై నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని, రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటుపడుతున్నాడని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ ప్రజా భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే మాట్లాడారు.మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. తెలంగాణ ఇస్తానన్న హామీని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్‌లో.. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. వారి మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రైతు రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమని అయినప్పటికీ ప్రత్యేకంగా సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆగస్టు 15 నుంచి పూర్తిస్థాయిలో రెండు లక్షల రుణమాఫీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 13వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేసిన ఘనతను గుర్తు చేశారు.
పదేళ్లలో కేసీఆర్ చేసిన రుణమాఫీ కేవలం రూ.28 వేల కోట్లు అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే తాము రుణమాఫీ చేశామన్నారు. పారదర్శకంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇస్తామన్నారు. ప్రధానంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో పోడు భూములను సాగు చేసుకుంటున్నా రైతులందరికీ త్వరలోనే పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గార్లపాటి శ్రీనివాసులు, మాధవరెడ్డి, అంతటి మల్లేష్, కాశన్న యాదవ్, రాంప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.