ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య ప్రతిష్టాత్మంగా అనేక పథకాలు, కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. అందులో భాగంగానే హైవేలు, స్కైవేలు, ఫ్లైఓవర్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. పలు జిల్లాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు పూర్తయి ప్రారంభోత్సవాలు కూడా అయిపోయాయి. కొత్త సెక్రటేరియట్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కూడా కొలువుదీరాయి. హుస్సేన్ సాగర్ తీరాన అమరుల స్ఫూర్తితో జ్యోతి కూడా వెలుగుతోంది. వీటన్నింటినీ ఆర్ అండ్ బీ శాఖ పర్యవేక్షించి, పనులు పూర్తి చేసింది. మరో దిక్కు నిమ్స్‌లో కొత్త బిల్డింగు, వరంగల్ ఎంజీఎంలో 28 అంతస్తుల నూతన భవనం పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ పనులన్నింటితో ఇప్పటిదాకా బిజీబిజీగా గడిపిన సదరు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి… ఈ మధ్య మీడియా మిత్రులతో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఆయా నిర్మాణాల విశేషాలను ఆయన వారితో పంచుకున్నారు. ఈ క్రమంలో ఓ సీనియర్ పాత్రికేయుడు… ‘అన్నా… కంగ్రాట్స్, పట్టు వదలని విక్రమార్కుడిలా మొత్తానికి పనులన్నింటినీ దిగ్విజయంగా పూర్తి చేశారు…’ అంటూ ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత మరో సీనియర్ అందుకుని… ‘సార్… మీ శాఖ యమ స్పీడ్‌గా పరుగెడుతోంది.. ఈ క్రమంలో నిమ్స్‌లో కొత్త భవనం, వరంగల్‌లోని ఆస్పత్రిని ఎప్పటిలోగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు…’ అంటూ మరో ప్రశ్న సంధించారు. దానికి వేముల గట్టిగా నవ్వి… ‘అరేబరు… న్యూ సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరుల జ్యోతి నిర్మాణ పనుల్లో ఈ మధ్య ఫుల్ బిజీ అయ్యా. ఒక్కోసారి రాత్రుల్లో కూడా పనులను పర్యవేక్షించి, సమీక్షల మీద సమీక్షలు చేశా. బాగా అలసిపోయా. అమరుల జ్యోతి ప్రారంభం రోజున కళ్ల మీద ఒకటే నిద్ర. అందుకే ఆ మర్నాడు ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఏకధాటిగా 14గంటలు నిద్రపోయా…మళ్లీ ఇప్పుడు మీరు నిమ్స్, వరంగల్ ఎంజీఎం అంటే భయమేస్తోందిరా బరు.. కొద్ది రోజులు నన్ను వదిలిపెట్టండ్రా బరు…’ అంటూ విలేకరులకు విజ్ఞప్తి చేయటంతో అక్కడున్న వారంతా మంత్రి ప్రశాంత్ వైపు చూశారు ప్రశంసాపూర్వకంగా. అనుకుంటాం గానీ…ఎంతో విలాసంగా, దర్జాగా ఉండే రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల జీవితాల వెనుక అంతకుమించిన రిస్క్, కష్టం కూడా ఉంటుంది కదా…
-బి.వి.యన్.పద్మరాజు