చిన్నసారొచ్చాకే.. సిట్టింగ్‌ సీట్ల మార్పులు..చేర్పులు…

It's small.. Changes in sitting seats..Additions...– నియోజకవర్గాల వారీగా మరోసారి సర్వే
– ఆ తర్వాతే పెండింగ్‌ స్థానాలు, అసంతృప్తులపై బీఆర్‌ఎస్‌ తుది నిర్ణయం
– రంగంలోకి 20 బృందాలు
– జిల్లాల్లో తారాస్థాయికి అసంతృప్తులు
– టిక్కెట్‌ వచ్చినా బీ-ఫామ్‌ దక్కే వరకూ ఆందోళనే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో 115 మందికి స్థానం కల్పించి… సంచలనం సృష్టించిన సీఎం కేసీఆర్‌, పెండింగ్‌లో ఉంచిన నాలుగు సీట్లతోపాటు నియోజకవర్గాల వారీగా మరోసారి బలాబలాలను బేరీజు వేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా మూణ్నెల్ల సమయమున్న నేపథ్యంలో అభ్యర్థుల సామర్థ్యాలను ఇంకోసారి తూకం వేయాలని ఆయన నిర్ణయించారు. అమెరికా పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత సామాజిక సమీకరణాలతోపాటు అసంతృప్త నేతలు, ఆశావహుల పేర్లను మరోసారి పరిశీలించి, జాబితాలో మార్పులు చేర్పులు చేయనున్నారు. తద్వారా పెండింగ్‌లో ఉన్న వాటికి కూడా అభ్యర్థులను
ప్రకటించి… పూర్తి లిస్టును ఖరారు చేయనున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. పెండింగ్‌లో ఉంచిన నర్సాపూర్‌ నుంచి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డిని బరిలోకి దించాలని సీఎం ఇప్పటికే నిర్ణయించారు. జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టిక్కెట్‌ నిరాకరించిన దరిమిలా… ఆయన స్థానంలో పల్లా రాజేశ్వరరెడ్డిని నిలిపేందుకు కేసీఆర్‌ రంగం సిద్ధం చేశారు. కానీ అక్కడ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి… కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావటంతో దీనిపై మంత్రి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ క్రమంలో పల్లా, పోచంపల్లి… ఈ ఇద్దరిలో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలనే దానిపై కేటీఆర్‌ వచ్చాక నిర్ణయం తీసుకోనున్నారు. గోషామహల్‌, నాంపల్లిలో మిత్రపక్షమైన ఎంఐఎం కోసం నామ్‌ కే వాస్తేగా బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటిపై వర్కింగ్‌ ప్రెసిడెంట్‌తో చర్చించి, తుది జాబితాను విడుదల చేయనున్నారు. దీంతోపాటు అభ్యర్థుల శక్తి సామర్థ్యాలను మరింత లోతుగా విశ్లేషించి, బేరీజు వేయాలని గులాబీ బాస్‌ నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే 20 బృందాలు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఆయా టీమ్‌లు ఇచ్చే నివేదికల ఆధారంగా ప్రస్తుతం విడుదల చేసిన తొలి జాబితాలో కూడా మార్పులు, చేర్పులుండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికి 10 నుంచి 18 స్థానాల వరకూ మార్పులు, చేర్పులు చేయొచ్చని చెబుతుండగా… బృందాలు ఇచ్చే రిపోర్టు ఆధారంగా వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదని అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నాయకుడు అభిప్రాయపడటం గమనార్హం. ఒకవైపు బీఆర్‌ఎస్‌ జాబితాలు, సర్వేలు, అంచనాలు ఇలా ఉండగా… మరోవైపు వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లో మాత్రం అసంతృప్తులు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. జహీరాబాద్‌, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, పాలేరు, నాగార్జున సాగర్‌, కోదాడ తదితర నియోజకవర్గాల్లో టిక్కెట్‌ దక్కని నేతలు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌కు ఆ పార్టీ జహీరాబాద్‌ టిక్కెట్‌ కేటాయించనుంది. దీంతో హస్తం పార్టీ తరపున బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆయన్ను ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే, తొలి జాబితాలో చోటు దక్కించుకున్న మాణిక్‌రావు ఢకొీట్టలేరని స్థానిక నేతలు చెబుతున్నారు. అందువల్ల ఆయన్ను మార్చి.. వేరే వారికి అవకాశమివ్వా లంటూ వారు కోరుతున్నారు. ఒకవేళ అభ్యర్థిని మార్చకపోతే ఆ సీటు కాంగ్రెస్‌ ఖాతాలో పడటం ఖాయమన్నది వారి వాదన. ఉప్పల్‌ నుంచి టిక్కెట్‌ దక్కని మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌… కేటీఆర్‌ వచ్చాక తాడో పేడో తేల్చుకుందామనే ఉద్దేశంతో ఉన్నారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇప్పటికే తన కార్యకర్తలు, నాయకులతో సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశాలను కొట్టిపారేయలేమని గులాబీ పార్టీ నేతలే పేర్కొనటం గమనార్హం. జనగామలో ముత్తిరెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య…సీటివ్వకపోతే ‘తగ్గేదేలే…’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు రూపంలో బీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగులుతోంది. శుక్రవారం ఆయన అభిమానులు నిర్వహించిన భారీ కార్ల ర్యాలీతో అధికార పార్టీకి దిమ్మ తిరిగింది. నాగార్జున సాగర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ను మార్చి.. వేరే వారికి టిక్కెట్‌ ఇవ్వాలంటూ సీనియర్‌ నేత వెలగపూడి కరుణాకర్‌రావు డిమాండ్‌ చేస్తున్నారు. గుర్రంపోడు మండలంలో స్థానిక నేతలు, కార్యకర్తలతో ఆయన నిర్వహించిన సమావేశాలు గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి.కోదాడలో స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు టిక్కెట్‌ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు…తన మద్దతుదారుడు శశిధర్‌రెడ్డితో మంతనాలు కొనసాగిస్తున్నారు. వారు తమ అనుయాయులతో కలిసి త్వరలోనే సీఎంను కలవనున్నారని సమాచారం. మరోవైపు టిక్కెట్‌ దక్కినా…బీ-ఫామ్‌ అందుకునే వరకూ గ్యారెంటీ లేదనీ, వ్యవహారమంతా సస్పెన్స్‌గా, సైలెంట్‌గా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.