మైనారిటీలు ఇందిరమ్మ మహిళా శక్తి పథకానికి దరఖాస్తు చేసుకోండి

– ఆన్ లైన్ గడువు ఈ నెల 31 వరకు
– మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా
నవతెలంగాణ – పాల్వంచ 
 రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ  పేద మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల కొరకు ‘ఇందిరమ్మ మహిళా శక్తి’ పథకం ద్వారా అందిస్తున్న ఉచిత కుట్టు మిషన్లు పొందడానికి  దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా సోమవారం  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే  18  నుండి 55 సంవత్సరాల వయస్సు కలిగి, ఆదార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డుతో పాటు కనీస విద్యార్హత 5వ తరగతి కలిగి ఉండాలన్నారు. తెల్ల రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఇవి రెండూ లేని వారు గ్రామీణ ప్రాంతాలలోని వారైతే రూ.1.50లక్షల లోపు, పట్టణ ప్రాంతాలలో రూ.2 లక్షల లోపు ఆదాయ దృవీకరణ పత్రం స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుండి పొంది ఉండాలన్నారు.
     అదేవిధంగా గుర్తింపు పొందిన శిక్షణా సంస్థలు, లేదా తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా టైలరింగ్ కోర్సులో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన మహిళలు తమ పాస్ పోర్టు ఫోటో తో  డిసెంబర్ 31లోపు  tgobmms.cgg.gov.in అనే వెభ్సైట్‌లో తమ‌ వివరాలు  నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆన్ లైన్ ప్రక్రియ అనంతరం హార్డ్ కాపీలను డౌన్లోడ్ చేసుకుని సంబందిత దృవీకరణ పత్రాలను జతపరచి ఆయా జిల్లాలలో గల మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయాలలో సమర్పించాలన్నారు. ఈ అవకాశాన్ని మైనార్టీ వర్గాలకు చెందిన ముస్లిం, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేద మైనార్టీ మహిళలకు, విడాకులు పొందిన వారికి, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాధలకు తొలి ప్రాధాన్యత కల్పించబడుతుందన్నారు. ఇతర వివరాలకై  8520860785 నంబర్ కు సంప్రదించాలని తెలిపారు.