మైనార్టీ కమిషన్‌ రంజాన్‌ గిఫ్టులకే పరిమితం

– లక్ష రూపాయల సహాయంతో మరో మోసం : మర్రి శశిధర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మైనార్టీల కమిషన్‌ రంజాన్‌ గిఫ్టులకే పరిమితమైందనీ, వారిని మరోమారు మోసం చేసేందుకు ఎన్నికల ముందు లక్ష రూపాయల సహాయం జీవోను విడుదల చేశారని బీజేపీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇలాంటీ జీవోలు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అప్లికేషన్‌ ఎప్పుడు చేయాలి? లక్ష రూపాయల అమౌంట్‌ ఎప్పుడు విడుదల చేస్తారు? అనే వివరాలేమీ లేవనీ, అది ఒక పేక్‌ జీవో అని విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలోనే మైనార్టీ కమిషన్‌కు కొత్త డైరెక్టర్లను నియమించారన్నారు. దళిత బంధులో లాగానే ఇందులోనూ ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటారని ఆరోపించారు. సిక్కులు, బౌద్ధులు, జైనులు మైనార్టీలు కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను నమ్మితే మైనార్టీలు మోసపోయినట్టేనన్నారు.