నా కోసం
మీరు ఎవరు
కొట్టుకోకండి
తొక్కుకోకండి
మీ నాలుగు వేళ్లు
మీ నోటిలోకి పోవాలంటే
నాకు తోడై నడవండి……
నేను కోట్లుపెట్టి
సినిమా తీయలేను…..
గుప్పెడు గింజలతో
గుమ్మెడు పంటదిస్తాను ….
సినిమాలో సగం
బట్టలేసుకునేటొల్లాకే
మరి మీరు ఫ్యాన్లు కాదా…
నేను కూడా సగం బట్టలే
వేసుకుంటాను ….
అక్కడ అంగాంగ
ప్రదర్శనకు దాసులై మీరు
ఆకలిని తీర్చే
అవని పుత్రునికి
కొంచం బాసటై నడవండి…
తిండికి పైసలేకున్న
ఆలిపుస్తేను
అవుసులోల్లకు అంగడిలో అమ్మి
ఆరెసుకున్నా బోమ్మలకు
బ్యానర్ కట్టే మీరు
మంచి మనుషులు కాదా మీరు…
నాకు బ్యానర్ వొద్దు
నా బాటకు తోడైతే సాలు
నా పాటకు కోరసైతే సాలు
నా శ్రమను
రంగుల సంచులతో నింపి
అంగు ఆర్బాటాలతో
సోము చేసుకుంటుండు…
ఓ సోయిలేని సహౌదర
జర నాకు తోడుగా నడవండి…
అంగట్లో దొరికే
అన్నింటికీ ముందే మరణ
తేదీ ముద్రించి ఉంది…
మరి నాకు
ఎక్స్పైర్ డేట్ లేదు
ఎందుకంటే నాలో విషం లేదు
నాకు విజన్ ఉంది…
నా విలువలను
నేను నిర్ణయించే హక్కు
కల్పించెందుకు
నాగలి పట్టి నేను
నడుస్తున్నా…
నాకు బాసటగా నడవండి
నేను మీకు పిడికెడు బువ్వ పెట్టి
సాదుకుంటా నా సంకలో ఏసుకొని …
నాకు తోడుగా నడవండి
నాకు తోడుగా నడవండి…
నేను బాగుంటేనే
నీకు బతుకు అద్దం అవసరం…
నేను లేకుంటే
నీ బతుకుకు తెల్లబట్టనే అవసరం…
నాకు తోడుగా నడిస్తే
నీ జాతికి నీవు నీడై నిలిచినట్లే
నాకు బాసట నిలిస్తే
నీ జాతి భవిష్యత్తుకు
పిడికెడు మెతుకులు ఇచ్చినట్లే…
నాకు తోడుగా నడవండి
మీకు పచ్చని చెట్లలా నీడనిస్తా
తల్లి దూరమైన వానికి
గోవునై పాలిస్తా….
ఆలి దూరమైనా వారికీ
ప్రకతినై అక్కన చేర్చుకుంటా…
నేను కోట్లు అడగడం లేదు
కోంచమంత సహాయం అడుగుతున్నా
నాకు తోడుగా నడవండి …
– ఉప్పరి తిరుమలేష్
9618961384