విద్యాలయాలలో వికృత చేష్టలు

– పాఠశాలలను చుట్టుముడుతున్న మతోన్మాద జ్వాలలు
– మైనారిటీలే లక్ష్యంగా చిన్నారులలో విష బీజాలు
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం సామాజిక మాధ్యమాలలో ఓ వీడియో కన్పించింది. ఓ గ్రీకు బాలిక హిందీలో పాట పాడుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ శ్రద్ధగా విన్నారు. ఆ పాపతో మాట్లాడినప్పుడు ఆయన వదనం ఆనందంతో వెలిగిపోయింది. గ్రీకు బాలిక హిందీలో పాట పాడినందుకు గర్వంగా ఫీలయ్యారు కూడా. కానీ ఆ చిన్నారికి ఉత్తరప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అమానుష ఘటన గురించి ఏం తెలుసు? ఆమెకు వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలోని విద్యాలయంలో ఓ బాలుడి చెంప మీద కొట్టాల్సిందిగా ఉపాధ్యాయురాలు అతని సహచర విద్యార్థులను ప్రేరేపించారు. తన చెంప మీద దెబ్బలు పడుతుంటే ఆ విద్యార్థి భయంతో వణికిపోయాడు. కళ్ల వెంట నీరు ధారాపాతంగా కారింది. కానీ ఆ ఉపాధ్యాయురాలికి కనికరం కలగలేదు సరికదా గట్టిగా దెబ్బలు కొట్టనందుకు విద్యార్థులపై కోపగించుకున్నారు. దెబ్బలు తిన్న ఆ విద్యార్థి ఎవరో తెలుసా ? ఓ ముస్లిం బాలుడు. మరి ఆ అధ్యాపకురాలు…అగ్రకుల దురహంకారి. మైనారిటీలు అంటే ఆ ఉపాధ్యాయురాలికి ఎంత కసి, కోపం ఉన్నదో ఆమె ఆ సందర్భంలో ప్రయోగించిన భాష వింటే అర్థమవుతుంది. మరి ఎక్కడో ఉన్న గ్రీకు బాలికకు ఇదంతా ఎలా తెలుస్తుంది?. తన పాట విని భారత ప్రధాని ఉబ్బితబ్బిబయ్యారని సంబరపడిందే కానీ భారతావనిలోని విద్యాలయాలలో ఇలాంటి భయానక దృశ్యాలు కన్పిస్తాయని ఆ చిట్టితల్లికి ఏం తెలుసు?
వారి పైనే గురి
మోడీ ప్రభుత్వం మైనారిటీల విషయంలో ఎంత వివక్ష ప్రదర్శిస్తోందో అందరికీ తెలిసిందే. మైనారిటీ విద్యార్థులకు ఉద్దేశించిన అనేక ఉపకార వేతనాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. వారి బంగారు భవితకు, సాధికారతకు తోడ్పడే ఉపకార వేతనాలను రద్దు చేయడం అంటే వారిని చదువులకు దూరం చేయడమే అవుతుంది. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ఈ విద్వేష జ్వాలలు మైనారిటీలను దహించి వేస్తూనే ఉన్నాయి. ఇప్పుడవి పాఠశాలల్ని కూడా చుట్టుముట్టాయి. చలనచిత్రాల ద్వారా ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజల్లో విష బీజాలు నాటుతున్న ఉదంతాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ది కాశ్మీర్‌ ఫైల్స్‌, 72 హూరైన్‌, కేరళ స్టోరీ వంటి చిత్రాలు మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని తీసినవే. ఈ చిత్రాలకు సంఫ్‌ు పరివార్‌, బీజేపీ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఉన్మాదం ఎంతగా తారాస్థాయికి చేరిందంటే కాశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రానికి ప్రతిష్టాత్మక ప్రభుత్వ అవార్డు లభించింది. ఎందుకో తెలుసా…ఆ చిత్రం జాతీయ సమగ్రతను చాటిచెప్పినందుకట.
చిన్నారులను సైతం…
దేశంలో మైనారిటీలకు వ్యతిరేకంగా ఇలాంటి దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు జరగడం ప్రతి ఒక్కరికీ సిగ్గుచేటే. ఈ దారుణాలను చూసి సిగ్గుతో తలదించుకోవడానికి బదులు వీటిని జాతికి గర్వకారణమైన ఘటనలుగా కీర్తించడం మరింత బాధాకరం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటనలను మతోన్మాద శక్తులు మరింతగా ప్రేరేపిస్తాయి. మైనారిటీలకు వ్యతిరేకంగా హిందూ ఓట్లను సంఘటితం చేసి, ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఈ శక్తులు ఎప్పటి నుండో ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా పిల్లలను కూడా తమ ఆటలో పావులుగా వాడుకోవాలని చూడడమే దారుణం. చివరికి చిన్నారుల్లో సైతం మతోన్మాద విష బీజాలు నాటే వికృత చేష్టలకు తెగబడుతున్నారు. ఓ వైపు చందమామ దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా నిలిచినందుకు గర్వపడాలో, మరోవైపు అమాయక బాలల్లో విద్వేషాలు రేపుతూ పైశాచిక ఆనందం పొందుతున్న ఉన్మాదుల వికృత చేష్టలను చూసి సిగ్గుతో కుమిలిపోవాలో అర్థం కాని పరిస్థితి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పదేళ్ల పనితీరును గమనిస్తే ఆ పార్టీ యంత్రాంగం ప్రధానంగా మతపరమైన సమీకరణలపై ఆధారపడిందని అర్థమవుతుంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో మతోన్మాద శక్తులు మరింతగా విజృంభిస్తున్నాయి. బహుశా రాజకీయ ప్రత్యర్థులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఇతర ప్రభుత్వ సంస్థలను ప్రయోగించడం మాత్రమే సరిపోదని ఈ శక్తులు భావిస్తూ ఉండవచ్చు.
విద్యకు దూరం చేసేందుకే…
పాఠశాలలో జరిగిన అమానుషకాండను వీడియోలో చూసి ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పోలీసులు ముజఫర్‌నగర్‌ జిల్లాలోని ఆ పాఠశాలకు వెళ్లారు. అమానవీయ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదంతా షరా మామూలుగా జరిగేదే. ఒకవేళ బాధిత బాలుడు హిందువు, ఉపాధ్యాయురాలు ముస్లిం అయి ఉంటే… ఆమెను వెంటనే అరెస్ట్‌ చేసి ఉండేవారు. ఆమె ఇంటి పైకి బుల్‌డోజర్‌ పంపి నేలమట్టం చేసే వారు. ఇక్కడ గమనించాల్సిన విషయ మేమంటే బాలుడి తండ్రి భయపడి ఉపాధ్యాయురాలిపై ఫిర్యాదు చేసేందుకు సైతం వెనుకాడారు. తన కుమారుడిని పాఠశాల మాన్పించడం మినహా ఆ అభాగ్యుడు ఏం చేయగలడు? మతోన్మాద శక్తులకు కావాల్సింది కూడా ఇదే. కర్నాటకలో హిజాబ్‌ వివాదం తర్వాత అనేక ముస్లిం కుటుంబాలు తమ కుమార్తెలను చదువులు మాన్పించిన విషయం గుర్తుండే ఉంటుంది.