దుర్భర జీవితం

– సమస్యలను ఎదుర్కొంటున్న కార్మికులు
– కార్మికులు, కూలీలను పట్టించుకోని అధికారులు
 – కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌
– ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని వేడుకోలు
నవతెలంగాణ నారాయణఖేడ్‌ రూరల్‌
నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో షాపింగ్‌మాల్‌, స్టోర్‌, పెట్రోల్‌ బంకులు, కట్‌ పీస్‌, కిరాణా షాపులు, బట్టల షాపులు స్టీల్‌ షాపులు, ఎలక్ట్రికల్‌ షాపులు, వెల్డింగ్‌ షాపులు, చారు హౌటల్‌, రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు, వైన్సులు, హాస్పిటళ్లు, విద్యాసంస్థలు, కటింగ్‌ షాపులు, సిమెంట్‌ షాపులు, మెడికల్‌ షాపులు, హార్డ్వేర్‌ షాపులు, రైస్‌ మిల్లులు, రైస్‌ షాపులు, జువెలర్స్‌ షాప్‌, అడ్డ మీద కూలీలు, హమాలీలు… ఇలా అనేక రకాల కార్మికులు 15 వేల మంది నారాయణఖేడ్‌ పట్టణంలో పని చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా షాపులలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నెలకు రూ.8 వేల నుంచి రూ.12 వేల జీతానికి పని చేస్తున్నారు. కొన్ని షాపులలో రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు మాత్రమే ఇస్తున్నారు. ఏ దుకాణంలో కూడా కనీసవేతన చట్టాన్ని అమలు చేయడం లేదని కార్మికులు వాపోతున్నారు. 12 నుంచి 14 గంటల వరకు పని చేస్తున్నా కనీస వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల్లో టాయిలెట్‌ పోయడానికి బాత్రూమ్స్‌, రెస్ట్‌ రూమ్స్‌ లేవని పేర్కొంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించడానికి ఎవ్వరూ ముందుకురావడం లేదని అంటున్నారు. నారాయణఖేర్‌ పట్టణంలో లేబర్‌ కమిషన్‌ ఉందా లేదా అన్న చందంగా ఉందని వాపోతున్నారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ ఇవ్వడం లేదంటున్నారు. నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నా కార్మికుల జీతాలు పెరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రిక్షానే ఆధారం
రిక్షా కార్మికుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. 20 సంవత్సరాల నుండి రిక్షా తొక్కుకుంటూ.. దీని మీదనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రిక్షా కార్మికులు రోడ్డుమీద పడ్డారు. ప్రభుత్వం మా జీవితాల్లో వెలుగులు నింపాలని వినతి.
– రిక్షా కార్మికులు యాదుల్‌, లక్ష్మయ్య, నజీర్‌
పండ్లు అమ్ముతూ..
తోపుడు బండ్లు మీద పండ్లు అమ్ముకుని బతికే వాళం. 12 సంవత్సరాల నుంచి తోపుడు బండ్ల మీదనే మా జీవనాధారం. షాపుల యజమానులు, పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయడం లేదు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల స్థలం ఇస్తే బాగుండు. బ్యాంకు రుణాలు ఇవ్వాలి.
– చాంద్‌ పాషా, తోపుడుబండి కార్మికుడు
గిరాకీ లేక..
ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాం. ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గిరాకీ లేక పోవడంతో కుటుంబం గడవలేని పరిస్థితి. పోలీసులు చాలాన్లు అధికంగా వేస్తూ వేధిస్తున్నారు. ఇండ్లు ఇళ్లస్థలాల సహాయం చేయాలని కోరుతున్నాం.
– రమేష్‌ ఆటో కార్మికుడు
బతుకులు అధ్వానం
హమాలీ కార్మికుల బతుకులు చాలా అధ్వానం. 20 సంవత్సరాల నుంచి హమాలీ కార్మికుడిగాపని చేస్తున్నాం. రూ.ఐదు నుంచి రూ.పది వరకు ఒక బస్తాకు ఇస్తున్నారు. కుటుంబం గడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదు. అధిక ధరలతో అధ్వాన స్థితిలో ఉన్నాం. హమాలీ రేట్‌ పెంచి ప్రభుత్వం ఆదుకోవాలి.
– హమాలీ కార్మికుడు సంజీవులు
భూమి లేదు
భూమి లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మా ఊర్లో కూలీ దొరకడం లేదు. పట్టణంలో తక్కువ కూలీ ఇస్తున్నారు. మా కుటుంబం గడవాలంటే చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం మాకు ఆదుకోవాలి. ధరల కనుగుణంగా కూల రేట్లు పెంచాలి
– కూలీలు రామయ్య, శంకర్‌
సమస్యలు పరిష్కరించాలి
పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరగడంతో చాలీచాలని జీతాలతో కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇండ్లు, ఇళ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌ రూములు ఇవ్వాలి. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులకు విన్నవించినా పండించుకోవడం లేదు. కార్మిక చట్టాల అమలు చేయడం లేదు. కనీస వేతనం అమలు చేయడం లేదు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి సౌకర్యాలు కల్పించాలి. కార్మిక సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం. కార్మికులను ఐక్యం చేసి పోరాటం చేస్తాం.
– ఎస్‌ చిరంజీవి, సీఐటీయూ నాయకుడు