– ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-మంగపేట
శబరిమలై వెళ్లి మొక్కులు తీర్చుకుని ఇంటికి తిరుగుముఖం పట్టిన స్వాములు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మలుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన ఐదుగురు స్వాములు తలారి సుబ్బయ్య నాయుడు(52), నర్ర సాంబయ్య(55) నిమ్మల వెంకట్రాజు(49), కునారపు అజరు(24), జరుపుల రాములు(26) వారి దీక్ష సమయం ముగియడంతో మాల విరమణకు గత గురువారం కారులో శబరిమలైకు వెళ్లారు. అక్కడ మొక్కులు తీర్చుకుని మాల విరమణ చేసి అదే కారులో కమలాపురం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం తమిళనాడు వద్ద వారి కారు అదుపుతప్పి కాల్వర్టును ఢ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తలారి సుబ్బయ్య నాయుడు, నర్ర సాంబయ్య, నిమ్మల వెంకట్రాజు అక్కడిక్కడే మృతి చెందగా, కునారపు అజరు, జరుపుల రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించడంతో కమలాపురం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సామాజికవేత్త, హ్యూమన్ రైట్ సభ్యులు అయిన సుబ్బయ్య నాయుడు మరణం పట్ల మండలంలోని పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు.