– వచ్చే రెండేండ్లలో భారత్‌కు పెను ముప్పు
– ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ నివేదిక హెచ్చరిక
న్యూఢిల్లీ : తప్పుడు సమాచారం విషయంలో భారత్‌ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ హెచ్చరించింది. తప్పుడు సమాచారం, ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారం వచ్చే పార్లమెంటరీ ఎన్నికలకు ముందు, రాబోయే రెండేండ్లలో భారత్‌కు పెను ప్రమాదమని తన నివేదికలో పేర్కొన్నది. దీనితో పాటు వచ్చే రెండేండ్లలో భారత్‌కు అంటు వ్యాధులు, అక్రమ ఆర్థిక కార్యకలాపాలు, అసమానత, కార్మికుల కొరత ఇతర ప్రధాన ప్రమాదాలు అని సంస్థ తెలిపింది.
విద్యా, వ్యాపారం, ప్రభుత్వంలో 1,500 మంది నిపుణుల సర్వే ఆధారంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ‘గ్లోబల్ రిస్క్ రిపోర్ట్స్’ను రూపొందించింది. రాబోయే రెండు నుంచి పది ఏండ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొనే వివిధ రకాల నష్టాలను ఇది అంచనా వేస్తుంది. ఆర్థిక, పర్యావరణ, భౌగోళిక, సామాజిక, సాంకేతికత అనే ఐదు రకాల నష్టాలను నివేదిక పేర్కొన్నది. ‘తప్పుడు సమాచారం’ అనేది సాంకేతిక ప్రమాదాలలోని ఉప-వర్గం.
భారత్‌తో సహా రాబోయే రెండేండ్లలో ఎన్నికలు జరగనున్న దేశాల్లో తప్పుడు సమాచారం ప్రభుత్వాల చట్టబద్ధతను తీవ్రంగా అస్థిరపరుస్తుందని నివేదిక పేర్కొన్నది. కృత్రిమ మేధస్సుతో నడిచే తప్పుడు సమాచార ప్రచారాలను గుర్తించడం చాలా కష్టంగా మారిందనీ, మైనారిటీ కమ్యూనిటీల వంటి నిర్దిష్ట సమూహాలను లక్ష్యంగా చేసుకుంటుందని కూడా నివేదిక హెచ్చరించింది. ఇటువంటి కంటెంట్ ఓటర్లను ప్రభావితం చేయగలదనీ, నిరసనలకు ఆజ్యం పోసి హింసకు దారితీస్తుందని వివరించింది. అలాగే, ప్రజాస్వామ్య ప్రక్రియల క్షీణతకు దారితీస్తుందని హెచ్చరించింది. విపరీతమైన వాతావరణ సంఘటనలు చాలా దేశాలు ఎదుర్కొనే పెను ప్రమాదంగా ఉంటాయనీ, దీని తర్వాత భూమి వ్యవస్థలలో క్లిష్టమైన మార్పులు, జీవవైవిధ్య నష్టం, పర్యావరణ వ్యవస్థ పతనం, సహజ వనరుల కొరత ఏర్పడుతుందని పేర్కొన్నది.
మోడీ పాలనలో దేశంలో ఇప్పటికే తప్పుడు సమాచారం తీవ్రమైన విషయాన్ని సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు చెప్తున్నారు. ఇది భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఏ మాత్రమూ శ్రేయస్కరం కాదని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, వాస్తవాలు, అవాస్తవాల విషయంలో అవగాహనను కలిగి ఉండాలని సూచిస్తున్నారు.