తప్పుదోవ పట్టించిన మంత్రి హరీశ్‌ రావు హెచ్‌ఆర్‌డీఏ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణంపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని హెల్త్‌కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌ డీఏ) విమర్శించింది. ఈ మేరకు అసోసియేషన్‌ అధ్యక్షులు కె.మహేశ్‌ కుమార్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2009లో నాటి ముఖ్యమంత్రి రోశయ్య ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించారని తెలిపారు. 2014 తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించిన బ్లూప్రింట్‌ గానీ లేదా ప్లాన్‌ గానీ లేదా నిధుల కేటాయింపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు కాని ఇవ్వలేదని తెలిపారు. గత నాలుగేండ్లుగా పాత వారసత్వ భవనంపై ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని? ప్రశ్నించారు. పాత భవనం కూల్చి వేసి లేదా కూల్చివేయకుండా కొత్త భన నిర్మాణంపై ప్రభుత్వ నిర్ణయమేంటని హైకోర్టు అడిగినా, గత నాలుగున్నరేండ్ల నుంచి ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చివరిసారిగా 2022 డిసెంబర్‌ 13న కోర్టు, ప్రభుత్వ వైఖరి ఏంటని? అడిగి ఆరు నెలలు గడుస్తున్నా…ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు. కోర్టు నిర్ణయం తీసుకుంటుందని వైద్యారోగ్యశాఖ మంత్రి చెప్పడం తప్పుదోవ పట్టించడమేనని పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో సమీక్షలను ఆపి, కోర్టులో కొత్త బిల్డింగ్‌ బ్లూ ప్రింట్‌, ఆఫిడవిట్‌ దాఖలు చేసి, నిధులను కేటాయించి, నిర్దేశిత సమయంలో భవన నిర్మాణం పూర్తి చేసేందుకు పూనుకోవాలని కోరారు.
డీఎంఈకి వినతి…
ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనాన్ని నిర్మించాలని జాయింట్‌ అసోసియేషన్‌ ఫర్‌ న్యూ ఒజీహెచ్‌ (హైదరాబాద్‌) కోరింది. ఈ మేరకు అసోసియేషన్‌ నాయకులు రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ కె.రమేశ్‌ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. పాత భవనంలో వైద్యమందించడం ఇబ్బందికరంగా మారిందనీ, రోగులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.