మిషన్ భగీరథ నీళ్లు మాకొద్దు..

– గ్రామ కార్యదర్శికి ముత్తారం మహిళల వినతి
నవతెలంగాణ – ముత్తారం
మిషన్ భగీరథ నీళ్లు మాకొద్దని ముత్తారం మహిళలు అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ముత్తారం గ్రామ పంచాయతీ సరఫరా చేస్తున్న మంచినీరు దుర్వాసన, నీరు మురికిగా వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మానేరు నుంచి ఏ విధంగా మంచినీటిని సరఫరా చేశారో అదేవిధంగా ముత్తారం గ్రామ పంచాయతీలో మంచినీటిని సరఫరా చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ ను మంగళవారం కలిసి కోరారు. మురికిగా, దుర్వాసన వస్తున్న నీరు సేవించడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నామని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మహిళలు ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శిని కోరారు.