మూడవరోజుకు చేరిన మిషన్ భగీరథ సర్వే..

– సర్వే బృందం లో కార్యదర్శి ఒక్కరే సర్వే
నవతెలంగాణ – పెద్దవూర
మండలం లో వున్న 26 గ్రామపంచాయతిలలో మిషన్ భగీరథ నీళ్ల పై చేస్తున్న ఇంటింటికి సర్వే బుధవారం మూడవరోజుకు చేరుకుంది. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ భగీరద తాగునీటి సర్వే ముమ్మరంగా సాగుతుంది. మండలం లోని చింతపల్లి, చలకుర్తి, వెల్మగూడెం, పెద్దవూర గ్రామాల్లో పంచాయతి కార్యదర్శులు ఇంటింటికి సర్వే చేపడుతున్నారు. గత మూడు రోజుల నుంచి ఉపాధిహామీ,ఆర్ డబ్ల్యూ ఎస్ తదితర శాఖల  అధికారులు ఇంటింటా నీటి సర్వే చేపట్టాలసి ఉండగా కేవలం పంచాయతీ కార్యదర్శులు మాత్రమే సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే లో  మిషన్ భగీరథ పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి నల్లాలను బిగించారా? ఈ నల్లాల ద్వారా ఒక కుటుంబానికి  సరిపడా నీళ్లు వస్తున్నాయా ?అసలే నల్లాలు వేయని ఇండ్లు ఎన్ని ఉన్నాయి?తదితర అంశాలను సేకరిస్తూ,ప్రతి నల్లాను పరిశీలిస్తూ నేరుగా ప్రతి ఇంటికి వెళ్లి,ఇంటి యజమానితో మాట్లాడుతూ.. తనిఖీ బృందం  ఫొటోస్ సైతం తీయాల్సి ఉండగా ఒక పంచాయతీ కార్యదర్శి మాత్రమే సర్వే నిర్వహిస్తుండడం విశేషం.