మేడ్చల్‌ జిల్లాలో ‘అవిశ్వాసం’ టెన్షన్స్‌..!

మేడ్చల్‌ జిల్లాలో 'అవిశ్వాసం' టెన్షన్స్‌..!– మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో చర్చ
– జెడ్పీ చైర్మెన్‌పై కొనసాగుతున్న అవిశ్వాసం
– అధికార మార్పిడితో ఈ పరంపర కొనసాగే ఛాన్స్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ‘అవిశ్వాసం’ టెన్షన్‌ మొదలైంది. ఎన్నికలకు ముందే పలు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినా.. అప్పటి అధికార పార్టీ పెద్దల బుజ్జగింపులతో ముందుకు సాగలేదు. ఎన్నికల సమయంలో పలువురు కార్పోరేటర్లు, కౌన్సిలర్లు పార్టీ మారగా.. త్వరలో మరికొందరు సైతం పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. దాంతో ‘అవిశ్వాస’ తీర్మానాలు మరోసారి తెరపైకి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే జెడ్పీ చైర్మెన్‌పై జెడ్పీటీసీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో త్వరలో అవిశ్వాసాల పరంపర కొనసాగే అవకాశం కన్పిస్తోంది.
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 4 కార్పొరేషన్లు, 10 మున్సిపాల్టీలు ఉన్నాయి. బోడుప్పల్‌, జవహర్‌నగర్‌, నిజాంపేట, పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు దమ్మాయిగూడ, దుండిగల్‌, ఘట్‌కేసర్‌, గుండ్ల పోచంపల్లి, కొంపల్లి, మేడ్చల్‌, నాగారం, దమాయిగూడ, పోచారం, తూంకుంట మున్సిపాల్టీల్లో దాదాపు అన్నింటినీ బీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. ఎన్నికలకు ముందే స్వపక్షంలో విపక్ష నేతలుగా మారి బీఆర్‌ఎస్‌ అధిష్టానం నియమించిన మేయర్లు, చైర్మెన్లను గద్దె దించాలని ప్రయత్నాలు చేశారు. అధిష్టానం, అప్పటి జిల్లా మంత్రికి అల్టిమేటం చేసి నోటీసులు సైతం ఇచ్చారు. కానీ పార్టీ పెద్దల బుజ్జగింపులతో కాస్త వెనక్కి తగ్గారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో జిల్లాలోని కొందరు కౌన్సిలర్లు, కార్పోరేటర్లు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొంతమంది పార్టీలు మారగా.. మరికొంత మంది త్వరలోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెజార్టీ సభ్యులు ఇదే దారిలో నడిస్తే కౌన్సిల్‌లో కోరం కూడా ఉండదు. ఈ నేపథ్యంలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మెన్లు, వైస్‌ చైర్మెన్లలో టెన్షన్‌ నెలకొంది. కార్పోరేషన్లు, మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగి నాలుగేండ్లు కావస్తుంది. మరో ఏడాది పదవీ కాలం ఉండటంతో ఎలాగైనా పదవిని సొంతం చేసుకోవాలని కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. స్థానిక నేతల మధ్య అసమ్మతి పెరిగిపోవడంతో మరికొద్ది రోజుల్లోనే వరుస అవిశ్వాస తీర్మానాల నోటీసులు ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీలో చేరితే అభివృద్ధికి అడ్డంకులు ఉండవనే సాకు చూపుతూ అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
మేడ్చల్‌లోనే అధికం..
జిల్లాల్లోని మేడ్చల్‌ నియోజకవర్గంలోనే ఎక్కువగా బీఆర్‌ఎస్‌ నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా 7 మున్సిపాల్టీలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. నాగారం, పోచారం, తూంకుంట మున్సిపాల్టీలు మినహా మిగతా అన్నింటిలోనూ అసంతృప్తి జ్వాలలు ఉన్నట్టు సమాచారం. జవహర్‌నగర్‌, బోడుప్పల్‌, పీర్జాదిగూడ కార్పొరేషన్లలో ఇప్పటికే అసమ్మతి ఉండగా, జవహర్‌నగర్‌లో గతంలోనే అవిశ్వాసం నోటీసు సైతం అందజేశారు. జవహర్‌నగర్‌ మేయర్‌ను మార్చాలంటూ అప్పటి జిల్లా మంత్రిపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. అదే సమయంలో కార్పోరేషన్‌లో కీలక నేత శంకర్‌గౌడ్‌ సహా, తన కుమార్తె కార్పోరేటర్‌ నిహారికా గౌడ్‌ కూడా పార్టీ మారారు.
ఇదే సమయంలో మేడ్చల్‌, దమ్మాయిగూడ మున్సిపాల్టీల్లోనూ అవిశ్వాసానికి ప్రయత్నం చేశారు. ఇక ఎన్నికలకు ముందే ఘట్‌కేసర్‌ మున్సిపాల్టీలో ఆరుగురు కౌన్సిలర్లు పార్టీ మారారు.
జెడ్పీ చైర్మెన్‌పై కొనసాగుతున్న అవిశ్వాసం
మేడ్చల్‌-మల్కాజిగిరి జెడ్పీ చైర్మెన్‌పై అవిశ్వాసం కొనసాగుతోంది. జిల్లా వైస్‌ చైర్మెన్‌ బెస్త వెంకటేష్‌తోపాటు మేడ్చల్‌, శామిర్‌పేట జెడ్పీటీసీలు వారం రోజుల క్రితమే జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసును అందజేశారు. కాగా బీఆర్‌ఎస్‌కు చెందిన జెడ్పీ చైర్మెన్‌ శరత్‌చంద్రారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. జెడ్పీ చైర్మెన్‌ పదవికి రాజీనామా చేయకుండానే పార్టీ మారడంతో బీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీలు అసంతృప్తిలో ఉన్నారు. దీంతో వారు అవిశ్వాస అస్త్రం సందించారు.