దర్యాప్తు సంస్థల దుర్వినియోగం

Investigating agencies Misuse– 45 కంపెనీలపై దాడులు
– ఈబీల ద్వారా దండుకున్నది రూ.400 కోట్లు : బీజేపీపై కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే ఆగ్రహం
న్యూఢిల్లీ : ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. నలభై ఐదు కంపెనీలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించిందని, వాటి నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.400 కోట్లు దండుకున్నదని మండిపడింది. ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా తన ఆర్థిక వనరులపై బీజేపీ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు జరిపిన తర్వాత మరో పదిహేను కంపెనీలు కూడా బీజేపీకి విరాళాలు అందించాయని తాజా విచారణలో బయటపడిందంటూ మీడియాలో వచ్చిన వార్తలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రస్తావించారు. ‘మరిన్ని విరాళాలు పొందేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం బ్లాక్‌మెయిల్‌ కాదా? దోపిడీ కాదా? బలవంతం చేయడం కాదా? ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల తర్వాత మరో పదిహేను కంపెనీలు బీజేపీకి విరాళాలు ఇచ్చాయని తాజా విచారణ తేల్చింది. వీటితో కలిపి మొత్తం 45 కంపెనీలు బీజేపీకి రూ.400 కోట్ల విరాళం అందించాయి’ అని ఖర్గే తెలిపారు. తనకు అందిన సమాచారం ప్రకారం నాలుగు షెల్‌ కంపెనీలు కూడా బీజేపీకి నిధులు సమకూర్చాయని ఆయన చెప్పారు. ఓ వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ సొమ్ము దండుకున్న నిరంకుశ మోడీ ప్రభుత్వం మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేసిందని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగవిరుద్ధమైన, చట్టవిరుద్ధమైన ఎన్నికల బాండ్లను ఉపయోగించుకోవడం ద్వారా బీజేపీ తన దోపిడీ సొమ్మును పది రెట్లు పెంచుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీకి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా తన ఆర్థిక వనరులపై స్వతంత్ర విచారణ ద్వారా శ్వేతపత్రాన్ని తీసుకురావాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. నాలుగు షెల్‌ కంపెనీలు, పదకొండు కంపెనీలు సహా మొత్తం పదిహేను కంపెనీలు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు ఎదుర్కొన్నాయని, మరో 30 కంపెనీలు ఐటీ, ఈడీ దాడులను ఎదుర్కొని బీజేపీకి రూ.335 కోట్లు సమర్పించుకున్నాయని మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు.