మిథునం కథా రచయిత శ్రీరమణ ఇకలేరు

ప్రముఖ కథకుడు, రచయిత, జర్నలిస్ట్‌ శ్రీరమణ (కామరాజ రామారావు) (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారు జామున 5 గంటలకు హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పేరడీ రచనలు, వ్యంగ్య హాస్య భరితమైన కాలమిస్టుగా, కథకుడిగా, సాహిత్య, కళా రంగాల్లో శ్రీరమణకి మంచి పేరుంది.
ఎస్‌.పి బాలసుబ్రమణ్యం, లక్ష్మి నటించిన ‘మిథునం’ చిత్రానికి శ్రీ రమణ కథ అందించారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాతో రచయితగా శ్రీరమణ, దర్శకుడిగా తనికెళ్ళభరణికి మంచి పేరు లభించింది. బాపు, రమణ వంటి పలువురు ప్రముఖులతో పనిచేసిన శ్రీ రమణ పేరు సాహితీ ప్రపంచంలో వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పేరడీలు, శ్రీకాలమ్‌, శ్రీఛానెల్‌, చిలకల పందిరి, హాస్యజ్యోతి, మొగలిరేకులు వంటి తదితర ఎన్నో శీర్షికలతో పాటు పలు పుస్తక రచనలతో పాఠకులను అలరించారు. అలాగే ఆంధ్రజ్యోతి నవ్య, సాక్షి.. వంటి పలు పత్రికలకు పని చేశారు. శ్రీరమణ మృతి పట్ల సినీ, సాహితీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.