మిగ్జామ్‌ ఎఫెక్ట్‌

మిగ్జామ్‌ ఎఫెక్ట్‌– తెలంగాణకూ రెండ్రోజులు భారీ వర్షసూచన
– బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం
– దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై విపరీత ప్రభావం చూపుతున్న మిగ్జామ్‌ తుఫాన్‌ తెలంగాణపైనా ఎఫెక్ట్‌ చూపనున్నది. రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన సంచాలకులు కె.నాగరత్న తెలిపారు. దక్షిణాంధ్రప్రదేశ్‌, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గర మిగ్జామ్‌ తుఫాన్‌ కేంద్రీకృతమై ఉందని చెప్పారు. 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతున్నదని తెలిపారు. ఈ తుఫాన్‌ మరింత బలపడి ఐదోతేదీన ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీరం దాటే అవకాముందని పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ‘మంగళవారం నాడు రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి, అత్యంత భారీ వర్షాలు, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మి. వేగంతో వీచే అవకాశం వుంది’ అని తెలిపారు. బుధవారం నాడు పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.