
తెలంగాణ పేరుతో ఉన్న తెంలగాణ యూనివర్సిటీని అభివృద్ధి చేసేందుకు ముందుంటానని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. బుధవారం టియులో జరిగిన రాష్ట్రస్థాయి గణిత పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ యాదగిరి ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి నివేదికను సమర్పించి రాబోయే ఆర్ధిక సంవత్సర బడ్జెట్లో యూనివర్సిటీ కి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధిక నిధులు మంజూరు చేసేలా కృషి చేయాలని విన్నవించారు. టియులో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలకు శాశ్వత భవనాలతో పాటు అర్హులైన సిబ్బందిని నియమించాలని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు బడ్జెట్ మంజూరు చేయాలని కోరారు. టియులో పెరిగిన బాలికల అడ్మిషన్ల ఆధారంగా నూతన భవనాలు మంజూరు చేయాలన్నారు. ప్రాంత అభివృద్ధి అనేది ప్రాంత విద్యారంగంపై ఆధార పడి ఉంటుందని, యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎల్లవేళలా అభివృద్ధిలో ముందుండి ప్రతిపాదనల ద్వారా ప్రభుత్వ శాఖలతో నిధులు మంజూరు చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో కంట్రోలర్ అరుణ, ప్రిన్సిపాల్ ఆరతి, అడిషనల్ కంట్రోలర్ నందిని, పిఅర్ఓ డాక్టర్ పున్నయ్య పాల్గొన్నారు.