– మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
నవతెలంగాణ-మంచిర్యాల
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అండతో అతని బంధువులు, అనుచరులు రెచ్చి పోతున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. శనివారం మంచిర్యాల పట్టణంలో గల తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రౌడీ ఇజం, గుండా ఇజం చేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంచి పేరున్న జిల్లాకు చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు అతని అనుచరులు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధం గ మంచిర్యాలలో అక్రమ కేసులు బనాయింపు, భూ కబ్జాలు, గ్యాంగ్ వార్‌లు ఎక్కువయ్యాయని, ఎమ్మెల్యే అండతో కొందరు రూ.కోట్ల సంపాదించాలని చూస్తున్నారని అందులో భాగంగానే అడ్డు వచ్చిన వారిపై బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ కేసులు నమోదు చేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు రాకేష్‌పై జరిగిన దాడిలో నిందితులపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేస్తే స్థానిక ఎమ్మెల్యే చొరవతో కేసును మార్చి, నిందితులు బయటకు వచ్చే విధంగా సెక్షన్‌లు మార్చి కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఇవన్నీ పోలీసులు కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, ప్రజల రక్షణ కొరకు పని చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తూ సాధారణ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. పోలీసుల తీరుపౖౖె ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. నియోజక వర్గంలో జరిగే అన్యాయాలపై నిలదీస్తామని ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు అంకం నరేష్, పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, విజిత్ రావు పాల్గొన్నారు.