ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రీన్‌ సిగల్‌

EC– 18న నామినేషన్లు, 29న పోలింగ్‌, ఫలితాలు
– రెండు ఎమ్మెల్సీల స్థానాల భర్తీకి కసరత్తు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. శుక్రవారం నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లు దాఖలకు గడువుంది. 19న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ఉంటుంది. ఈనెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వారిద్దరి పదవీ కాలం 2027 నవంబర్‌ 30వ వరకు ఉంది. ప్రస్తుతం శాసనసభ్యుల బలాబలాలను బట్టి చూస్తే కాంగ్రెస్‌కు మెజార్టీ ఉంది. రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతుండటంతో అవి కాంగ్రెస్‌కే దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్‌ కసరత్తు
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంతో అభ్యర్థులపై కాంగ్రెస్‌ కసరత్తు ప్రారంభించింది. ఎమ్మెల్యే కోటా, గవర్నర్‌ కోటా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేషన్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ ఫోకస్‌ పెట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ వెళ్లేటప్పటికి కొన్ని నామినేటెడ్‌ పదవులకు నేతలను ఎంపిక చేసే అవకాకశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం పార్టీలో పోటీ తీవ్రంగా నెలకొంది. మొత్తంగా ఆరుగురు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించాల్సి ఉన్నది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులకు మంత్రి పదవులు దక్కుతాయన్న ప్రచారంతో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. పార్టీ సీనియర్‌ నేతలు జి చిన్నారెడ్డి, షబ్బీర్‌ అలీ, జగ్గారెడ్డి, అద్దంకిదయాకర్‌, బెల్లయ్యనాయక్‌, సంపత్‌కుమార్‌, పటేల్‌ రమేష్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీగౌడ్‌, ఫిరోజ్‌ఖాన్‌, వేం నరేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా జరగనున్న ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలిసింది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలకు ఏదో ఒక రంగంలో సేవ చేసే వారికి ఇవ్వాల్సి ఉన్నది. అందులో టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరాం, విద్యావేత్త జాఫర్‌ జావిద్‌, మస్కతి, అజరుద్దీన్‌ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.