నవ తెలంగాణ-నవీపేట్
బోధన్ శాసనసభ్యులు మహమ్మద్ షకీల్ ఆమీర్ ను ఎన్నికల్లో మద్దతు తెలిపి ఓటు వేసిన వర్గానికే మోసం చేస్తుంటే మిగతా ప్రజల సంగతి ఏంటని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోధన్ నియోజకవర్గ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా గడపగడపకు బీజేపీ కార్యక్రమాన్ని మండలంలోని మోకన్ పల్లి గ్రామంలో కార్యకర్తలతో కలిసి గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనలో చేసిన సుపరిపాలన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ ను ఎన్నికల్లో మద్దతు తెలిపిన వర్గానికి చెందిన నాయకులు ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు బనాయించి మోసం చేస్తున్నారని అటువంటప్పుడు సామాన్య ప్రజల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని ప్రగల్బాలు పలికి వారి బతుకులను రోడ్డుపాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోకన్ పల్లిలో 202, 203 బూతులలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అలాగే బీజేపీ కార్యకర్తలు పోతంగల్ 183 బూత్ లో ప్రచారం చేశారు. గడపగడపకు బీజేపీ కార్యక్రమానికి విశేష స్పందన రావడంతో బోధన్ లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రొడ్డ సుధాకర్, ఆనంద్, నారాయణరెడ్డి, రమణారావు కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.