కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరితో పాటు సామాన్య భక్తుడిగా అక్కడ ఎమ్మెల్యే అన్నదాన భోజనం చేశారు. అలాగే భోజనం చేయడానికి వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే స్వయంగా అన్నం, పప్పు వడ్డించారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద మండలాలకు చెందిన అయ్యప్ప స్వాముల సహాయ సహకారాలతో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. జుక్కల్ నియోజకవర్గానికి చెందిన వారు ఇక్కడ భక్తులకు కడుపునిండా భోజనం పెట్టడం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఆకలితో అలమటించే భక్తులకు ఉచితంగా అన్నదానం చేయడం అందులో కేరళ రాష్ట్రంలో చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భక్తి మరియు సేవా భావాన్ని అభినందిస్తూ భాగ్యనగర్ అయ్యప్ప సేవాసమితి వారు ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే తో పాటు నాయకులు సాయి పటేల్, కొండ గంగాధర్, తైదల్ రవి, పీఏ మురళీ మనోహర్ , కిషోర్ ఉన్నారు.భాగ్యనగర్ అయ్యప్ప సేవాసమితి అధ్యక్షులు రాధాకృష్ణ మరియు గురు స్వాములు గురుజాల రామ్ మోహన్, మల్లారి రఘు స్వామి, బిచ్కుంద పులెన్ విఠల్ స్వామి, తైదల్వార్ రవి స్వామి ఉన్నారు.