నవతెలంగాణ – పెద్దవంగర
పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజాపాలన అందిస్తానని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ‘మన ఊరు-మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని ఉప్పరగూడెం, అవుతాపురం, చిట్యాల, బీసీ తండాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజలతో మాట్లాడి, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంపీపీ ఎర్ర సబిత వెంకన్న, జెడ్పీటీసీ శ్రీరామ్ సుధీర్, మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ తో కలిసి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందన్నారు.
ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఉప్పెరగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, పుస్తక పఠనం ద్వారా జ్ఞాన సంపదతో పాటుగా మానసికాభివృద్ధి సొంతం చేసుకోవచ్చనిని పేర్కొన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో నిర్వహించిన తెలంగాణ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. చెట్లు మనుషులకు ప్రాణవాయువు ను అందిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతాయన్నారు. చెట్లు అంతరించిపోతోతూ ఉష్ణోగ్రతలు పెరిగి జీవుల మనుగడకు సమస్యలు ఎదురవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై విధిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎల్బీ తండాలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎంపీడీవో వేణుమాధవ్, వైస్ ఎంపీపీ బొమ్మెరబోయిన కల్పన రాజు యాదవ్, మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుంపల కుమారస్వామి, తోటకూరి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు మెట్టు సౌజన్య నగేష్, బానోత్ విజయ, వేముల వెంకన్న, సలిదండి సుధాకర్, రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.