ఎమ్మెల్యే సారు జరా దేఖో…!

ఎమ్మెల్యే సారు జరా దేఖో...!– గుంతలమయమైన దాదాపూర్‌ బిటీ రోడ్డు
– గుంతల రోడ్డులో ఇరుక్కుపోయిన బస్సు
– రోడ్డు మరమ్మతులు చేసి, కల్వర్ట్‌ నిర్మాణం చేపట్టాలి
– గంటపాటు ఇబ్బందులు పడ్డ విద్యార్థులు,ప్రయాణికులు
నవతెలంగాణ-దోమ
వర్షాకాల సమయంలో ఉన్న ఇబ్బందులు చాలవు అన్నట్టు వాటికి తోడుగా రోడ్లపై గుంతలతో ప్రజలు, వాహనదారులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలోని దాదాపూర్‌ గ్రామ మధ్యలో ఉన్న బిటీ రోడ్డు 10 ఏండ్లుగా గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీ నిధులతో కొంత మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ తిరిగి గుంతలు ఏర్పడ్డాయి. ఈ సమస్య గురించి ఎన్నో సార్లు ఆర్‌అండ్‌బీ అధికారులు స్థానిక ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లారు. కానీ సమస్య పరిష్కరం కాలేదు. రోజు ఎంతోమంది ప్రయాణికులు వివిధ పనుల నిమిత్తం వెళ్లే దారిలో గుంతులు ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపూర్‌లో ఉన్న పాఠశాలకు చుట్టుప్రక్కల ఉన్న వివిధ గ్రామాల నుంచి ఎంతో మంది విద్యార్థులు కాలినడకన వస్తుంటారు. ఈ గుంతల వల్ల విద్యార్థులు జారి బురదలో పడిపోవడం, వాహనాలు అదుపు తప్పి పడిపోవడం వంటివి జరగడంతో రోజువారి పనులకు ఇబ్బందిగా మారింది. రాత్రి సమయంలో అయితే ఎంతో మంది ద్విచక్ర వాహనదారులు ఇక్కడ కిందపడి ప్రమాదాలకు గురవుతున్నారు. నిరంతరం ఎంతో రద్దీగా ఉండే ఈ రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి దాదాపూర్‌ రోడ్డుపై ఏర్పడిన గుంతలను పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు, విద్యార్థులు కోరుతున్నారు.